సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారిన జీవో నెంబర్ 9 ( బీసీ రిజర్వేషన్ల అంశం)పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి విదితమే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం నిర్ణయించింది.
హైకోర్టు ఆదేశాల కాపీ ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై విచారణ చేపట్టాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జీఓ 9 అమలుకు న్యాయపరంగా పోరాడాలని అధికారులతో, మంత్రులతో జరిగిన సమీక్ష అనంతరం సీఎం రేవంత్ తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి (RevanthReddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మీనాక్షి నటరాజన్‌లతో జూమ్ మీటింగ్‌లో చర్చలు జరిపారు. బీసీ రిజర్వేషన్లపై తమ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ 42 శాతం రిజర్వేషన్లను కొనసాగించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చారు.