చీరాల హైవేపై టెన్షన్.. టెన్షన్
- బోట్ల కాలవ పూడిక తీయొద్దు
- రియల్టర్లకే అనుకూలం
- మత్స్యకారుల భారీ ర్యాలీ అడ్డగింత
బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : సముద్రం పైనే మా జీవనం.. సముద్రమే మా జీవనాధారం.. ప్రాణాలకి తెగించి కడలిపై ఆధారపడి బతుకుతున్న మా జీవన స్థితిగతులపై రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారుల దౌర్జన్యాలు నిలిపివేయాలంటూ 18 గ్రామాల మత్స్యకారుల నిరసన. బాపట్ల చీరాల మధ్య సముద్ర తీరంలో పర్యాటక రంగ అభివృద్ధి పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మత్స్యకారులు దశాబ్దాల తరబడి కాపాడుకుంటున్నపొగరు స్థలాలను పూడ్చివేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారని దీనిని వెంటనే నిలిపివేయాలని మత్స్యకారుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.
విజయలక్ష్మి పురం(Vijayalakshmi Puram) సమీపంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే మురుగు సముద్రంలో కలిపే పొగరు కాలువను పూడ్చివేసి వెంచర్లు(Ventures)గా మారుస్తున్నారని దీనిపై గత జిల్లా కలెక్టర్ వెంకట మురళి(Venkata Murali)కి వినతి పత్రం అందజేసిన ఫలితం దక్కలేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై దృష్టి సారించి మత్స్యకారులు అనాదిగా వినియోగిస్తున్నజీవనస్థితిగతులను దెబ్బతీయకుండా కాపాడాలని కోరుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. చీరాల పోలీసులు(Cheerala Police) తొలిత భారీ ప్రదర్శనను అడ్డుకున్నారు.
దీంతో జాతీయ రహదారి(National Highway)పైనే మత్స్యకారులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సూచన మేరకు వారిని వదిలివేశారు .దీంతో ఆ ప్రాంతం నుండి బాపట్ల జిల్లా(Bapatla District) కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనగా మత్స్యకారులు వస్తున్నారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తామని సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని మత్స్యకారులు(Fishermen) స్పష్టం చేస్తున్నారు.

