మంథని, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాలలో పని చేసే పార్ట్ టైం టీచర్లు (Part-time Teachers) పండగ పూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. గత మూడు నెలల నుండి వారికి జీతాలు అందడం లేదు. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో సుమారు నాలుగు వేల మంది పార్ట్ టైం ఉద్యోగులు సేవలందిస్తున్నారు. అయితే వారు రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తి కావస్తున్నది. ఇంతవరకు జీతం అందలేదు.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులంలో సేవలందిస్తున్నటువంటి పార్ట్ టైం ఉద్యోగులు పేరుకు మాత్రమే పార్ట్ టైం. వారి సేవలు మాత్రం ఫుల్ టైం. గతంలో అవర్ లీ బేస్డ్ గా తీసుకొని వాటికి మాత్రమే పీరియడ్ ప్రకారం జీతాలు ఇచ్చేవారు. ప్రస్తుతం రెగ్యులర్ ఉపాధ్యాయులకు సమానంగా వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే నైట్ స్టడీ డ్యూటీ, నైట్ స్టే డ్యూటీ, హాలిడే డ్యూటీ, ఎస్కార్ట్ డ్యూటీ, మెస్ డ్యూటీ, ఇతర బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగిస్తోంది.
మూడు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఇంతవరకు అప్పులు చేసి జీవనం సాగించామని పలువురు పార్ట్ టైం ఉద్యోగులు తెలిపారు. పండగ పూట అప్పులు ఇచ్చే నాథుడే కరువయ్యారని, దీంతో పస్తులు ఉండక తప్పదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని కోరారు.

