ఆసుపత్రికి తరలించగా మృతి
అతడు కర్నాటక వాసి
ముగ్గురు ఆడపిల్లల తండ్రి
ముగిసిన హైవోల్టేజీ ..టెన్షన్ కథ
రేణిగంటలో ఇదొక విషాదం
( రేణిగుంట , ఆంధ్రప్రభ) :
హైటెన్షన్ విద్యుత్తు టవర్ పై హల్ చేసిన వ్యక్తి .. ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున 4.00 గంటల నుంచి ప్రారంభమైన ఈ హైటెన్షన్,, దాదాపు 11.00 గంటల వరకూ కొనసాగి.. అధికారులకు ముచ్చెమటలు పట్టించిన ఈ ఘటన అతడి దుర్మరణంతో ముగిసింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలో విద్యుత్ టవర్ ఎక్కిన వ్యక్తి కాసేపటి కిందికి దూకాడు. వెంటనే పోలీసులు అతడిని హుటాహుటిన తిరుపతి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. మృతుడు కర్ణాటకకు చెందిన శివానిగా పోలీసులు గుర్తించారు. అతడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చాడు. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో ట్రెయిన్ మిస్ కావడంతో మద్యం తాగి టవర్ ఎక్కాడు. ఆయనకు భార్య, ముగ్గురు కూమార్తెలు ఉన్నట్లు సమాచారం.అసలేం జరిగిందంటే .. రేణిగుంట మండలంలోని గురవరాజు పల్లి వద్ద ఉన్న హై వోల్టేజీ టవర్ ను ఓ వ్యక్తి ఎక్కాడు. టవర్ మీద ఉన్న వ్యక్తిని తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని రేణిగుంట పోలీసులకు అందజేశారు. ఈ ఘటన స్థలికి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో హుటాహుటిన చేరుకునీ ఫైర్ ఇంజన్ పిలిపించారు. ఎలక్ట్రికల్ అధికారులతో మాట్లాడి హై వోల్టేజీ టవర్ లో కరెంట్ సరఫరాను నిలిపివేసారు. కరెంట్ టవర్ మీద ఉన్న వ్యక్తినీ కిందకు దించేందుకు పోలీసులు నచ్చ చెప్పారు. కానీ ఆ వ్యక్తి టవర్ పై నుంచి కిందికి దూకేశాడు.

