హైదరాబాద్, ఆంధ్రప్రభ : కృష్ణా జలాల్లో వాటా 299 టీఎంసీలుగా ఒప్పుకుంది కాంగ్రెస్ పార్టీనేనని.. ఇప్పుడు అదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడటం హంతకుడే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఈ రోజు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కృష్ణ జలాలపై తెలంగాణ ప్రభుత్వానిది పూటకో మాట.. గడియకో లెక్క అంటూ మండిపడ్డారు. చారిత్రక తప్పిదం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని.. తెలంగాణ సాగు నీటి రంగం చరిత్రలో ద్రోహులు వారేనని దుయ్యబట్టారు.
నిరూపిస్తే రాజీనామా..
కృష్ణా నదీ జలాల్లో (Krishna River waters) ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలని ఒప్పుకుందే కాంగ్రెస్ అని.. మళ్లీ సిగ్గులేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల హక్కుల విషయంలో తాము సంతకం పెట్టినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తామని అన్నారు. నిరూపించని లేని పక్షంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ ప్రాంత హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం రాసింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే.. ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసిందని, కొత్త ట్రిబ్యునల్ (Tribunal) వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా తిరిగి వాటలు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు.
అదో డబ్బా ప్రచారం…
సమ్మక్క సారక్క బ్యారేజ్ (Sammakka Sarakka Barrage) కు మంత్రి ఉత్తమ్ అనుమతులు సాధించినట్లు చెప్పుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఆయన తీరు ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌తో కేవలం 50 ఎకరాల ముంపునకు సంబంధించి సూత్రప్రాయ అంగీకారం కుదిరితే ఏదో గొప్పలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్ది, దేవాదులను పటిష్టం చేసేందుకు 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్‌ను కేసీఆర్ (KCR) నిర్మించారన్నారు. 83 మీటర్లకు డీపీఆర్‌ను పంపామని.. అన్ని డైరెక్టరేట్ల నుంచి అనుమతులు సాధించామని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ కలిసి చేస్తున్న ద్రోహం చేస్తున్నాయని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే.. సీఎ రేవంత్ రెడ్డి బిహార్ కు వెళ్లి రాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.

