- ఆటంకాలు చెప్పండి
- సాఫీగా ముందుకు సాగండి
- అమ్మ దర్శనం కోసం
- క్యూఆర్ కోడ్ పోస్టర్లు
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వెల్లడి
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : దసరా శరన్నవరాత్రుల్లో సాంకేతికత తోడుగా సామాన్య భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో కనకదుర్గమ్మ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశామని.. టెక్నాలజీ తోడుగా ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, హోల్డింగ్ ప్రాంతాలు, 1.8 కి.మీ. మేర ఉన్న క్యూలైన్.. ఇలా వివిధ ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ పోస్టర్లను ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి 100 మీటర్లకు ఈ కోడ్ పోస్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అభిప్రాయాలు లేదా సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే ఏర్పాట్లలో ఏదైనా అసౌకర్యాలు ఉన్నాయా? అనే ప్రశ్న కనిపిస్తుందని.. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చి, అభిప్రాయాన్ని తెలియజేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలని సూచించారు. 88855 92974 నంబరుకు కూడా కాల్ చేసి సమస్యను తెలియజేయవచ్చని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలియజేస్తే యుద్ధప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

