హైదరాబాద్ : సమ్మక్క–సారలమ్మ మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక పండుగ అయిన ఈ జాతర కోసం అభివృద్ధి పనులను గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రణాళికల రూపకల్పనలో సమ్మక్క–సారలమ్మ పూజారులను సంప్రదించి, వారి సూచనల మేరకు డిజైన్లను విడుదల చేయనున్నారు. ఈ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్‌సభ సభ్యుడు పోరిక బలరాం నాయక్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్వయంగా నేనే వెళ్లి పరిశీలిస్తా..
జాతర అభివృద్ధి పనులు ఏ పరిస్థితుల్లోనూ గిరిజన సంప్రదాయాలకు భంగం కలిగించకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 23న ఆయన స్వయంగా మేడారం వెళ్లి పూజారులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రణాళికలను ఖరారు చేయనున్నారు.
ప్రత్యేక సాంకేతిక కమిటీ..
పూజారుల సమ్మతితోనే డిజైన్లను విడుదల చేయాలని సీఎం సూచించారు. ఈ పనుల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూజారుల సూచనల మేరకు ఆలయ ప్రాంగణాన్ని విస్తరిస్తూనే, అమ్మవార్ల గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను పూర్తిగా గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు.
గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా స్వాగత తోరణాలను రూపొందించాలని, ఆలయం చుట్టూ స్థానిక, సంప్రదాయ వృక్షాలను నాటాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న మేడారంలోనే మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొనే విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

