నిండిన ఎన్టీఆర్ జలాశయం
- తెరుచుకున్న గేటు
- అధికారులు అప్రమత్తం
- జనం పారా హుషార్
(చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు (Chittoor) జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిత్తూరు తాగునీటికి ఉద్దేశించిన ఎన్టీఆర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. జలాశయానికి ఎగువనున్న మండలాల్లో భారీగా వర్షపాతం నమోదు కావడంతో వరద నీరు భారీగా ఎన్టీఆర్ జలాశయానికి చేరుకుంది. ఎన్టీఆర్ జలాశయం 109.17 ఎంసిఎఫ్టి సామర్థ్యం కాగా రెండు రోజుల్లో పూర్తిగా నిండి నిండుకుండలా మారింది. దీంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఒక గేటును ఎత్తి, 85 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు.
ఈ విషయమై పెనుమూరు తాహసీల్దార్ మాట్లాడుతూ… ఒక గేటు మాత్రమే ఎత్తడం జరిగిందని, పరిస్థితి అదుపులో ఉందన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని గేట్లను ఎత్తే విషయం ఇరిగేషన్ అధికారులు ఆలోచిస్తారన్నారు. ఎన్టీఆర్ జలాశయానికి (NTRReservoir) దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చిత్తూరు తాగునీటి కోసం ఉద్దేశించిన ఎన్టీఆర్ జలాశయాన్ని పెనుమూరు మండలం కల్వకుంట వల్ల వద్ద 1996లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2004లో ఈ జలాశయం నిర్మాణం పూర్తయింది. ఆ రోజు నుంచి చిత్తూరు పట్టణానికి ఎన్టీఆర్ జలాశయం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
ఇటీవల కాలంలో జలాశయంలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరిగి ఎన్టీఆర్ జలాశయం పూర్తిగా నిండిపోయింది. జిల్లాలో 17, 18 తేదీల్లో అన్ని మండలాల్లో వర్షపాతం నమోదయింది. 17వ తేదీన జిల్లా సగటున 31 మిల్లీమీటర్లు, 18 వ తారీఖున 25.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు బాగా రెండు రోజుల్లో కలిపి 123.6 మిల్లీమీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదయింది. ఎన్టీఆర్ జలాశయానికి ఎగువనున్న ఐరాల మండలం (irala mandal) లో 140 మిల్లీమీటర్లు, పూతలపట్టులో 149.4 మిల్లీమీటర్లు, రొంపిచర్లలో 81.8, సదంలో 205.4, పులిచర్లలో 173.4, తవణంపల్లిలో 14 మంది మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈ నీళ్లు భారీగా ఎన్టీఆర్ జలాశయానికి చేరడంతో తిరిగేసిన అధికారులు ఒక గేటును ఎత్తివేశారు. జిల్లాలో గురువారం కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. కావున వరద నీరు భారీగా చేరి అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ జలాశయం నీటి సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.