భార్య పల్నాడు కలెక్టర్.. భర్త నెల్లూరు కలెక్టర్

ప్రజాసేవే ఉభయతారకం
అభ్యుదయ దంపతులకు
ఏపీలో ఉద్యోగ యోగం

పల్నాడు రూరల్ ప్రతినిధి , ఆంధ్రప్రభ : ఇది చాలా అరుదైన దృశ్యం..! బ‌హుశా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చ‌రిత్రలో ఇలాంటి సన్నివేశం మహా కష్టం . ఐఏఎస్ (IAS) సాధించి వివిధ హోదాలో ప‌నిచేసిన భార్యా, భ‌ర్తలు…ఒకే రోజు ఇద్దరూ క‌లెక్టర్లుగా ప్రమాణ‌ స్వీకారం చేయ‌డం మ‌రింత అరుదైన ఘట్టం . ఉమ్మడి ఆంధ్రప్ర‌దేశ్‌లో కానీ…విభ‌జిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ..ఇటువంటి దృశ్యాలు ఎప్పుడూ కాన‌ రాలేదనే చెప్పాలి. ఐఏఎస్ దంపతులు క‌లెక్టర్లుగా కొంద‌రు ప‌నిచేసి ఉండ‌వ‌చ్చు. కానీ..ఒకే రోజు భార్యా, భ‌ర్తలు ఇద్దరూ వేర్వేరు జిల్లాల‌కు క‌లెక్టర్లుగా ప‌ద‌వీ స్వీకారం చేయ‌డం మాత్రం చాలా అరుదైన సంఘ‌ట‌నే. నెల్లూరు జిల్లా క‌లెక్టర్‌గా హిమాన్ష్‌ శుక్లా (Himansh Shukla), ఆయ‌న స‌తీమ‌ణి కృతికా శుక్ల (Kritika Shukla) ప‌ల్నాడు జిల్లా క‌లెక్టర్‌గా శనివారం రోజునే ప‌ద‌వీ బాధ్యత‌లు చేప‌ట్టారు.

దంప‌తులు ఇద్దరూ ఒకే రోజు క‌లెక్టర్లుగా బాధ్యత‌లు చేప‌ట్టడంతో కుటుంబం, బంధువుల‌ను, స‌న్నిహితుల‌ను ఆనంద ప‌ర‌వశుల‌ని చేసింది. 2013 బ్యాచ్‌కు చెందిన ఈ దంపతులు ఒక‌రు ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన వారు కాగా మ‌రొక‌రు హ‌ర్యానా (Haryana)కు చెందిన వారు. వీరు మన రాష్ట్రంలో కలెక్టర్లు (Collectors)గా, జాయింట్ క‌లెక్టర్లు (Joint Collectors)గా, హెచ్ఓడీలుగా, ఇంకా అనేక శాఖ‌ల‌కు అధిప‌తులుగా ప‌నిచేశారు. సాధారణంగా ఐఏఎస్‌కు ఎంపిక కావ‌డ‌మే ఒక గొప్ప. ఐఏఎస్ (IAS) సాధించ‌డానికి ఎంతో మంది ఎన్నో ప్రయ‌త్నాలు చేసి విఫ‌లం అవుతారు…చాలా కొద్ది మంది మాత్రమే స‌క్సెస్ అవుతారు. అలా విజ‌యం సాధించిన వారికి క‌లెక్టర్‌గా ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం..వారి జీవితంలో మ‌రిచిపోలేని రోజు. ఒక జిల్లాకు క‌లెక్టర్ (Collector)గా ప‌ని చేయ‌డం ఐఏఎస్ సాధించిన వారికో గొప్ప గౌర‌వం.

సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) జిల్లా క‌లెక్టర్లుగా యువ‌త‌కు ప్రాధాన్యత ఇవ్వాల‌ని భావించ‌డంతో వీరిద్దరికీ ఒకేసారి క‌లెక్టర్లుగా ప‌నిచేసే అరుదైన అవ‌కాశం ల‌భించిందని చెప్పవచ్చు. త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశంతో పేద‌ల‌కు సేవ‌చేస్తామ‌ని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామ‌ని, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు త‌మ‌పై పెట్టిన బాధ్యత‌ల‌కు న్యాయం చేస్తామ‌ని వారు ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. ఫ్యాక్షన్ రాజ‌కీయాల (factional politics)కు నిల‌య‌మైన ప‌ల్నాడు జిల్లాలో ఆయ‌న భార్య కృతికా శుక్లాకు ప‌లు ఛాలెంజ్‌లు ఎదురుకానున్నాయి. నరసరావుపేట ఎంపీ (Narasaraopet MP)తోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన వారే కావడం…ఈ జిల్లాలో క‌లెక్టర్‌గా ప‌నిచేయ‌డం స‌వాల్‌తో కూడుకున్నదేనని చెప్పాలి. ఏది ఏమైనా..దంప‌తులు ఇద్దరూ..ఒకేసారి క‌లెక్టర్లుగా ప‌ద‌వీ బాధ్యతలు స్వీక‌రించిన వైనం… మహత్తర అంశం.

Leave a Reply