సీఎం దిశానిర్ధేశం పాటిస్తా

  • సమన్వయంతో పని చేస్తా
  • ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు


(ఆంధ్రప్రభ, ఒంగోలు బ్యూరో) : ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు (Collector P. Rajababu) చెప్పారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టరుగా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎన్.ఎస్.పీ. గెస్ట్ హౌస్ కు వచ్చిన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, డీఆర్వో.బి. చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం (Welcome) పలికారు. అనంతరం ప్రకాశం భవనానికి తోడుకొని రాగా, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా కలెక్టరుగా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దిశానిర్దేశం మేరకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ (Political Governance) పై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని, ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై తాను దృష్టి సారిస్తానని కలెక్టర్ (Collector) తెలిపారు. అనంతరం పలువురు జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు కలెక్టర్ ను కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply