ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సౌతాఫ్రికా(South Africa)తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ (England) జట్టు ఇరగదీసింది. రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి సౌతాఫ్రికాను చిత్తు చేసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం (12వ తేదీ) రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) 141 భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అనంతరం అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని 158 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లీష్ జట్టు 146 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.
ఇంగ్లాండ్ టీ20 చరిత్రలో తొలిసారి 300 పరుగుల మార్క్ అందుకుంది. అంతర్జాతీయ (International) టీ20ల్లో ఫుల్ మెంబర్ టీమ్‌పై అత్యధిక స్కోర్ చేసిన భారత్ రికార్డును ఇంగ్లాండ్ తాజా మ్యాచ్‌తో బ్రేక్ చేసింది. ఇదివరకు ఈ లిస్ట్‌లో భారత్ (India) ఉండేది. గతేడాది బంగ్లాదేశ్ (Bangladesh)పై టీమ్ఇండియా 297 పరుగులు చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ 304 రన్స్‌తో భారత్ రికార్డ్ బద్దలుకొట్టింది. అలాగే సౌతాఫ్రికాను ఇంగ్లాండ్ 146 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. టీ20 చరిత్రలోనే ఇంత భారీ తేడాతో నెగ్గిన జట్టుగా ఇంగ్లాండ్ వరల్డ్ రికార్డ్ (World Record) కొట్టింది.

