యాదాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ : భువనగిరి స్వర్ణగిరి క్షేత్రంలో స్వర్ణ గీరిషుడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణగిరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసి పోయింది. స్వామి వారికి పట్టు దుస్తులు ధరింపజేసి సుగంధ పుష్పామాలలతో అలకరించి కల్యాణ మహోత్సవాన్ని వేదమంత్రలతో, మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రాత:కాలంలో సుప్రభాత సేవను నిర్వహించి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతల కొలువుదీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించారు. స్వామివారికి వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారుబావి నుండి తీసుకు వచ్చి అభిషేకం చేశారు.
క్షేత్రంలో నాలుగు వేల మందికి పైగా భక్తులు నిత్యాన్నా ప్రసాదాన్ని స్వీకరించారు. క్షేత్రం గోవింద నామస్మరణలతో మార్మోగింది. తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సకల కార్య సిద్ధికి గణపతి హోమం నిర్వహించారు.

