ఆంధ్రప్రభ, వాజేడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం పెరగడంతో.. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరదనీటితో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
మునిగిన వంతెనలు – స్తంభించిన రాకపోకలు
వర్షాలు, వరదల వల్ల వంతెనలు మునిగిపోవడంతో గ్రామాలు, మండలాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో టేకులగూడెం గ్రామం వద్ద ఉన్న రేగు మాకు వంతెన పూర్తిగా నీట మునిగింది. దీంతో 163 జాతీయ రహదారిపైకి వరదనీరు చేరడంతో అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి.
పోలీసు శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందిస్తూ పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మంగళవారం సాయంత్రం నాటికి పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం 15.750 మీటర్లకు చేరింది. దీంతో పేరూరు-చందుపట్ల మధ్య మరివాగు వంతెన, వాజేడు-గుమ్మడిదొడ్డి మధ్య ఉన్న కొంగలవాగు వంతెన కూడా నీట మునిగి రవాణా సౌకర్యం స్తంభించింది.
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం సంభవించినా, వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.