ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025లో భారత్‌ను ఓడిస్తామని పాకిస్థాన్ హెడ్ కోచ్ అకీబ్ జావెద్ అన్నాడు. సీనియర్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకున్నా.. భారత్‌ను ఓడించే సత్తా ప్రస్తుత పాకిస్థాన్ జట్టుకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2025 బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టు ఆ దేశ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో సీనియర్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షాలకు చోటు దక్కలేదు. ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ అఘా సారథ్యంలో పాకిస్థాన్ ఆసియా కప్ 2025 బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఈఏ వేదికగా టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
మా జట్టు ఎవరినైనా ఓడించగలదు…
పాకిస్థాన్ జట్టు ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన అకీబ్ జావెద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆసియాకప్‌లో భారత్‌ను ఓడించే సత్తా పాకిస్థాన్ జట్టుకు ఉంది. మీకు నచ్చినా.. నచ్చకున్నా ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన పోరు భారత్-పాక్ మ్యాచ్. ప్రతీ ఆటగాడికి ఈ విషయం తెలుసు. మా జట్టు ఎవరినైనా ఓడించగలదు. ప్రతీ ఒక్కరు ఈ టోర్నీ కోసం సిద్దంగా ఉన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉంది. కానీ మేం మా ఆటగాళ్లపై అదనపు ఒత్తిడి పెట్టాలనుకోవడం లేదు.’అని అకీబ్ జావెద్ చెప్పుకొచ్చాడు. టీ20 ఫార్మాట్‌కు బాబర్ ఆజామ్‌ను పరిగణలోకి తీసుకోలేదని మరో కోచ్ మైక్ హెస్సన్ తెలిపాడు. కొన్ని అంశాల్లో బాబర్ మెరుగవ్వాల్సి ఉందని చెప్పాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఆడటం, స్ట్రైక్ రేట్ పెంచుకునే విషయాలపై బాబర్ ఆజామ్ ఫోకస్ పెట్టాల్సి ఉందన్నాడు.
ఆసియా కప్ 2025కు పాకిస్తాన్ జట్టు
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం, సల్మాన్ మీర్జా, షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, హసన్ అలీ, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.