• ఇక వాగులు వంకల పరుగులు
  • గోదారికి ..- శబరి పరుగులు


(ఆంధ్రప్రభ – చింతూరు) : బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణితో ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో.. అల్లూరు సీతారామరాజు జిల్లా (Alluri Seetharamaraju District) చింతూరు ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఛ‌త్తీస్ గఢ్ (Chhattisgarh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో, చింతూరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శబరి, గోదావరి నదుల్లో కలసి క్రమేపీ నెమ్మదిగా వరద ఉధృత్తి పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి సోమవారం మధ్యాహ్నా సమయానికి 36.50 అడుగులకు చేరుకుంది. చింతూరు (Chintoor) లోని శబరి నది సైతం గంభీరంగా పెరుగుతోంది. భారీ వర్షాల నేపధ్యంలో శబరి నదిలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఆంధ్రా సరిహద్దు రాష్ట్రాలు ఒరిస్సా, ఛ‌త్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సైతం వర్షపాతం ఎక్కువ నమోదు అవుతుండటంతో చింతూరు ఎగువ ప్రాంతాలు బలిమెల, డొంకరాయి, సీలేరు డ్యామ్ లలో వరద చేరి నిండుకుండలను తలపిస్తున్నాయి.

శబరి, గోదావరి (Sabari, Godavari) నదులకు అనుసంధానమైన వాగులు వంకలు సోకిలేరు, కుయుగూరు, అత్తకోడల్లు, చంద్రవంక వాగులు సైతం వరదతో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో చింతూరు – వీఆర్‌ పురం ప్రధాన రహదారిపై సోకిలేరు వాగు ప్రధాన రహదారిపై నుండి ప్రవహిస్తుండటంతో సుమారు మండలంలోని 11 గ్రామాలకు, వీఆర్‌ పురం మండలంలోని అన్నవరం వాగు సప్టా తెగిపోవడంతో చింతూరు – వీఆర్‌ పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల్లివారిగూడెం (Jallivarigudem) గ్రామ శివారు ప్రాంతంలోని అత్తకోడళ్ల వాగు రహదారిపై ప్రవహిస్తోంది. రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పహారా కాస్తు వాగులు దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. చింతూరు ఐటీడీఏ పీవో (ITDA PO) అపూర్వ భరత్‌, చింతూరు అదనపు ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా వాగుల వరద పరిస్థితిని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అల్లూరి జిల్లాలో కుంభవృష్టి….
అల్లూరి జిల్లా వ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురిసి వర్షపాతం భారీ (Heavy rainfall) గా నమోదు అయినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. జిల్లా కేంద్రం పాడేరులో 161.4 మిల్లీమీటర్లు, హుకుంపేట 112 మిల్లీమీటర్లు, అనంతగిరి 102 మిల్లీమీటర్లు, చింతూరులో 33.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జిల్లాలోని పలు మండలాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా ఎటపాక (Etapaka) మండలంలో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

హైవేపై టెన్షన్ టెన్షన్….
భద్రాచలం – చింతూరు (Bhadrachalam – Chintur) జాతీయ రహదారి పై ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ జాతీయ రహదారి విస్తరణ పనులతో అక్కడక్కడ కల్వర్టుల నిర్మాణం (Culverts Construction) జరుగుతోంది. ఈ నిర్మాణాలతో ఆ రహదారిలో వర్షపు రహదారిపై ప్రవహిస్తూ తీవ్ర అటంకం కలిగిస్తున్నాయి. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో సదరు కాంట్రాక్టర్‌ తీవ్ర జాప్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply