అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు పరిమిత స్థాయిలో సాగుతున్న కాఫీ రంగం ఇప్పుడు పెద్ద ఎత్తున విస్తరించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాఫీ బోర్డుతో కలిసి రూ.202.19 కోట్ల విలువైన భారీ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే, గిరిజన రైతుల జీవితాల్లో విశేష మార్పులు చోటుచేసుకుంటాయని అధికారులు చెబుతున్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్ 2034-35 వరకు కొనసాగుతుంది. దీని కింద లక్ష ఎకరాల్లో కొత్త తోటలు ఏర్పాటు చేయడంతో పాటు, 75 వేల ఎకరాల పాత తోటల పునరుద్ధరణ చేపడతారు. కాఫీతో పాటు మిరియాల మిశ్రిత పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.

ఇప్పటి వరకు గిరిజనులు ప్రధానంగా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవించగా, కొత్త ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరానికి సంవత్సరానికి రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు ఆదాయం రావచ్చని అంచనా. దీని ఫలితంగా గిరిజన కుటుంబాల విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల చోటుచేసుకోనుంది.

ఆర్గానిక్ పద్ధతిలో సాగు

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే కాఫీని ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. కానీ సరైన పోషకాలు, సాంకేతిక సహాయం అందకపోవడంతో దిగుబడి తగ్గుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి కాఫీ బోర్డు ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులు చేపట్టింది. త్వరలోనే రైతులకు అనుగుణంగా ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ సిద్ధం చేసి అమలులోకి తెస్తారు. దీని వల్ల దిగుబడి, నాణ్యత, కప్ క్వాలిటీ అన్నీ మెరుగుపడతాయి.

ప్రపంచ బ్రాండ్‌గా తీర్చిదిద్దే ప్రణాళిక

ప్రస్తుతం దేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది (266,885 మెట్రిక్ టన్నులు). కేరళ (72,825), తమిళనాడు (18,435) తర్వాత ఆంధ్రప్రదేశ్ కేవలం 15,380 మెట్రిక్ టన్నులతో చివరి స్థానంలో ఉంది. కొత్త ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఏపీ ఉత్పత్తి 8-10 ఏళ్లలో కేరళ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే అరకు కాఫీకి యూరప్‌, అమెరికా, జపాన్ మార్కెట్లలో డిమాండ్ ఉంది. కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు గణనీయంగా పెరగడమే కాకుండా, ప్రత్యేక జీఐ ట్యాగ్ విలువ కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్గా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం.

రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక మార్గదర్శకాలు, శిక్షణ కార్యక్రమాలు అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గిరిజన రైతులు ఆటవిక ఆధార జీవనశైలినుంచి సుస్థిర వ్యవసాయ ఆధార జీవనశైలికి మారుతారని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply