సియాటెల్: అమెరికాలోని సియాటెల్ (Seattle) నగరంలో హాలీవుడ్ స్టైల్ లో భారీ దోపిడీ చోటుచేసుకుంది. స్థానికంగా పేరుగాంచిన మినాషే అండ్ సన్స్ నగల దుకాణంలోకి చొరబడ్డ నలుగురు దుండగులు కేవలం 90 సెకన్లలోనే రూ.17 కోట్లకుపైగా విలువైన వజ్రాభరణాలు (Diamond jewelry), లగ్జరీ గడియారాలను దోచుకెళ్లారు. ముఖాలకు మాస్క్‌లు (Masks) ధరించిన వారు గ్లాస్ డోర్‌ను బద్దలు కొట్టి దుకాణంలోకి ప్రవేశించి, అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. వెంటనే డిస్ప్లే (Display) లో ఉంచిన ఆరు కేసుల్లోని ఆభరణాలను చాకచక్యంగా సొంతం చేసుకుని పారిపోయారు.
ఈ మొత్తం ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో (CCTV cameras) రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు (police) దర్యాప్తు ప్రారంభించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దోపిడీకి గురైన నగల విలువ ప్రాథమికంగా 2 మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నప్పటికీ, వాస్తవంగా అది మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని దుకాణ యాజమాన్యం చెబుతోంది.