భారీ వర్షాల ప్రభావంతో గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రేపు (ఆగస్టు 14) సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత జిల్లా కలెక్టర్లు తెలిపారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం, ఆ జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ పాఠశాల హెడ్‌మాస్టర్లు రేపు సెలవు ఇవ్వాలని, అవసరమైతే పాఠశాల భవనాలను పునరావాస కేంద్రాలుగా ఉపయోగించేందుకు రెవెన్యూ అధికారులకు తాళాలు అప్పగించాలని డీఈఓ సూచించారు.
పల్నాడు జిల్లా డీఈఓ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేపు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నిరంతర వర్షాలు కురుస్తున్నందున, విద్యార్థుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రకటించిన ఈ సెలవు తర్వాత పూడ్చుకునే తేదీపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
అతి భారీ వర్షపాతం హెచ్చరిక
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడి బలపడిన అల్పపీడనం ప్రస్తుతం కాకినాడ తీరానికి సమీపంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మధ్యాహ్నం నుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న 6-7 గంటలపాటు ఈ వర్షాలు విరామం లేకుండా కొనసాగనున్నాయి.
ఈ వ్యవధిలో విజయవాడ, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, కోనసీమ, పల్నాడు జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర తీర ప్రాంతాలపై తూర్పు గాలులు వీచడం వల్ల, విశాఖపట్నం నగరంలో రేపు ఉదయం వరకు వర్షాలు ఆగకుండా పడతాయని అధికారులు తెలిపారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ తీవ్రతతో కురిసే ఈ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది.
ప్రత్యేకంగా విజయనగరం, అనకాపల్లి, పెందుర్తి, గాజువాక వంటి ప్రాంతాలలో వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని అధికారులు సూచించారు.