రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు హత్య కేసు (Gattu Vaman Rao murder case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ (CBI) కి అప్పగించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారణ జరపాలని సుప్రీంకోర్టు (Supreme Court) సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

అసలేంటి ఈ గట్టు వామన్ రావు కేసు..?
2021, ఫిబ్రవరి 17న వామనరావు దంపతులు దారుణ హత్య (Brutal murder) కు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు (Kishan Rao) అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వామన్ రావు దంపతుల మర్డర్ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే (Former BRS MLA) పుట్టా మధుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పుట్ట మధు తన మనుషులతో హత్య చేయించాడని వామన్ రావు బంధువులు ఆరోపించారు.

ఈ క్రమంలో అడ్వకేట్ దంపతులు (Advocate couple) వామనరావు, గట్టు నాగమణి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మృతుడి తండ్రి సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అంశంపై వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. వామనరావు దంపతుల హత్య కేసులో అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత పుట్టా మధు పోలీసులను ప్రభావితం చేశారని, పోలీసుల విచారణ (Police investigation) పై తమకు నమ్మకం లేదని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana government) గతంలో ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. వామన్ రావు మరణ వాంగ్మూలం వీడియోకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

అలాగే, వామనరావు దంపతుల కేసును సీబీఐకి అప్పగించడంలో తమకేలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ సర్కార్ (Telangana government) స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. వామన్ రావు దంపతుల మర్డర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేయడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందని ఉత్కంఠగా మారింది.

Leave a Reply