శ్రీనగర్ : భద్రతా దళాలు సోమవారం ‘ఆపరేషన్ మహాదేవ్’ ప్రారంభించింది. శ్రీనగర్ (Srinagar) సమీపంలోని లిద్వాస్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారని భారత సైన్యం తెలిపింది. హతమైన వారిలో లష్కరే తోయిబా ఉగ్రవాది (Lashkar-e-Taiba terrorist) సులేమాన్ (Suleiman) ఉన్నాడు. ఇతడే పహల్గామ్ ఉగ్ర దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను అబూ హమ్జా (Abu Hamza), యాసిర్ (Yasir) గా గుర్తించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని సైన్యం వెల్లడించింది.
ఉగ్రవాదుల నుంచి అనేక గ్రెనేడ్లు, ఏకే-47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 14 రోజుల క్రితం అనుమానాస్పద సంభాషణను సైన్యం పసిగట్టింది. అంతేకాకుండా సంచార జాతుల వారు ఇచ్చిన పక్కా సమాచారంతో సైన్యం ఆపరేషన్ చేపట్టి చంపేసినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో సైన్యం ఉగ్రవాదుల జాడను గుర్తించాయి. ఆ సమాచారాన్ని సంచార జాతుల వారు కూడా పక్కాగా నిర్ధారించారు. అంతే అత్యంత వ్యూహాత్మకంగా సైన్యం ప్రణాళికను అమలు చేసింది. ఉన్న చోటనే ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మతం పేరుతో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. భార్య, పిల్లల ఎదుటే భర్తలను చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వంద మంది ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశారు. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సైన్యం ఎప్పటి నుంచి వేటాడుతోంది. అనూహ్యంగా సోమవారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదుల్ని ఆశ్చర్యంగా సైన్యం హతమార్చింది. ఇక ఉగ్రవాదులు హతం కావడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు.