Mulugu | యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : ఎస్సై కృష్ణ ప్రసాద్

వాజేడు, జులై 12 (ఆంధ్రప్రభ) : యువత చెడు వ్యసనాలకు బానిస కాకూడదని ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ (Gurram Krishna Prasad) అన్నారు. ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు అభయ మిత్ర కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం శనివారం పేరూరు (peruru) గ్రామంలోని నాగులమ్మ సెంటర్ లో నిర్వహించి యువతకు తగు సూచనలు, సలహాలు అందించారు.

గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, అదేవిధంగా డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ కంపల్సరిగా ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి బుక్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారే వాహనాలు నడపాలని, లేనిపక్షంలో బండి యజమాని నడిపే వ్యక్తిపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా ఫోక్సో చట్టం గురించి తగు సూచనలు, సలహాలు అందించారు. మైనర్ బాలికలపై అత్యాచారం చేయడం చట్టరీత్యా నేరమని అలాంటి విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా అసాంఘీక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, అసాంఘీక శక్తులు ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. యువత క్రీడలపై మక్కువ చూపించాలని, క్రీడల వలన మానసిక ఉల్లాసం వ్యాయామం కలుగుతుందని తెలిపారు. పేరూరు యువతను ప్రోత్సహిస్తూ వాలీబాల్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply