పుట్టపర్తి క్రైమ్, జూన్ 3 (ఆంధ్రప్రభ) : పుట్టపర్తిలో చిత్రావతి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తిని పుట్టపర్తి అర్బన్ పోలీసులు ప్రాణాలను కాపాడారు. సోమవారం రాత్రి పుట్టపర్తిలో నివాసం ఉంటున్న కలకత్తాకు చెందిన రాజేష్ శర్మ కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకునేందుకు చిత్రావతి నదిలో దూకి చనిపోవాలనుకున్నాడు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న కొందరు యువకులు, చిత్రావతిలో దూకిన వ్యక్తి సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే పుట్టపర్తి ఇన్చార్జ్ సిఐ మారుతి శంకర్, ఏఎస్ఐ మధుసూదనరావు, కానిస్టేబుల్ మురళీలు, ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చిత్రావతి నదిలోని నీటి మధ్యలో మునుగుతూ తేలుతూ ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా, తన సిబ్బంది సహాయంతో పుట్టపర్తి గ్రామానికి చెందిన యువకులు గణేష్ నాయక్, హితేష్ నాయక్, మురళి, షామీర్ భాష అను యువకుల సహకారంతో, బోటులో వెళ్లి నది మధ్యలో ఉన్న రాజేష్ శర్మను పోలీసులు సమయస్ఫూర్తిని ఉపయోగించి కాపాడి బయటికి తీసుకువచ్చారు.
పోలీసులు వెంటనే స్పందించడం వల్ల ఆ వ్యక్తిని ప్రాణాపాయం నుండి రక్షించారు. సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. తమ వారిని కాపాడి ప్రాణాలు రక్షించిన పుట్టపర్తి పోలీసులకు, యువకులకు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక ఒక వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో వెంటనే స్పందించిన పోలీసుల తీరుపై పుట్టపర్తి పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని కాపాడిన సిఐ, ఏఎస్ఐ, సిబ్బంది, యువకులను జిల్లా ఎస్పీ వి.రత్న, పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్ అభినందించారు.