ఎల్లారెడ్డి, (ఆంధ్రప్రభ): ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట గ్రామ శివారులో గల నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఎల్లారెడ్డి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు యువకులు పట్టణ శివారులో సోమవారం సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం ఉక్కపోతగా ఉందని ఏదైనా చెరువులోకి వెళ్లి ఈత కొడదామని స్నేహితులందరూ నిర్ణయించుకున్నారు.దానితో 11 మంది యువకులు నేరుగా ఈత కొట్టేందుకు సోమర్పేట్ గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లోకి వెళ్లారు. అనంతరం అందరు స్నానానికి నీళ్లలోకి దిగారు. అందులో 8 మంది స్నానం చేసి బయటకు రాగా మధుకర్ గౌడ్ (17), నవీన్ (23), హర్షవర్ధన్ (17) అనే ముగ్గురు యువకులు గల్లంతయ్యారు.

ఎంతసేపటికి వారు బయటకు రాకపోవడంతో మిగతా యువకులు ఈ విషయం వారి వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ న్నారు. యువకులు గల్లంతయిన విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు కురుమ సాయిబాబా, నునుగొండ శ్రీనివాస్, మంచిర్యాల విద్యాసాగర్, జనార్దన్ రెడ్డి, అజార్, పాపయ్య లు సోమార్పేట్ గ్రామస్తులతో కలిసి గల్లంతైన యువకుల ఆచూకీ కోసం నిజం సాగర్ బ్యాక్ వాటర్ లో అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం రాత్రి సుమారు 9 గంటల వరకు ప్రయత్నం చేసిన అయినా వారి ఆచూకీలభించలేదు. మంగళవారం ఉదయం ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాగా మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యమైనది . ఫైర్ సిబ్బంది,పోలీసులు తెలిపారు. మిగతా మృత దేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.