Operation Kagar | త‌ల్ల‌డిల్లుతున్న‌ దండ‌కార‌ణ్యం .. మావోయిస్టుల‌కు అతిపెద్ద దెబ్బ‌

18 నెలల్లో 330 మంది మృతి
దండ‌కార‌ణ్యంపై కేంద్ర ప్ర‌భుత్వం ఫోక‌స్‌
సేఫ్ జోన్ల‌లోకి చొచ్చుకెళ్లిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు
బీట‌లువారుతున్న‌ న‌క్సల్స్‌ కంచుకోట‌లు
బీజాపూర్‌, సుక్మా, నారాయ‌ణ‌పూర్‌, అబూజ్‌మ‌డ్‌పై ఉక్కుపాదం
ముమ్మ‌ర కూంబింగ్‌తో మావోయిస్టుల ఉక్కిరిబిక్కిరి
వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు
కేంద్ర క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎన్‌కౌంట‌ర్ ఇదే తొలిసారి
కోలుకోలేని ఎదురుదెబ్బ అంటున్న ప‌రిశీల‌కులు

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌:

దశాబ్దాల పాటు ఎత్తుకు పైఎత్తులు.. వ్యూహాలకు ప్రతివ్యూహాలతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య దండకారణ్యంలో సాగుతున్న పోరు ఒక ఎత్తైతే.. నక్సల్ మిషన్ 2026 మరో ఎత్తుగా నిలిచింది. తుపాకీ మోత‌లు.. దూసుకొస్తున్న తూటాల‌తో దండ‌కార‌ణ్యం ద‌ద్ద‌రిల్లుతోంది. ఒక్కొక్క‌రుగా అన్న‌లు నేల‌కొరుగుతుంటే అడ‌విత‌ల్లి త‌ల్ల‌డిల్లుతోంది. ఏడాది కాలంలోనే వంద‌లాది మంది మావోయిస్టులు తుపాకీ తూటాల‌కు బ‌ల‌య్యారు.

కీల‌క స్థావ‌రాల‌పై ఫోక‌స్‌..

వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర ప్ర‌భుత్వం యుద్ధం ప్ర‌క‌టించింది. దీంతో నక్సల్స్ ఇలాకా అబూజ్ మడ్‌లో భ‌ద్ర‌తా బలగాలు గతేడాది కాలుమోపాయి. 2024లో దండకారణ్యంలో మావోయిస్టుల సంచారంపై ఉక్కుపాదం మోపేలా ప్రతి అడుగూ వ్యూహాత్మకంగా వేస్తూ వచ్చాయి. మావోయిస్టులకు ప్రధాన స్థావరాలుగా ఉన్న బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, అబూజ్‌మడ్‌ ప్రాంతాల్లో ముమ్మర కూంబింగ్‌తో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేశారు.

డ్రోన్లు, హెలికాప్ట‌ర్ల‌తో ఆప‌రేష‌న్‌..

మావోయిస్టులకు పెట్టని కోటలుగా ఉన్న దండకారణ్యంలోని ప్రాంతాల్లోనూ కేంద్ర బ‌ల‌గాలు పాగా వేసుకుంటూ ఆపరేషన్‌ను కొనసాగించాయి. ఇక మావోయిస్టులకు ప్రధాన కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను జల్లెడ పట్టేందుకు ఏకంగా 24 వేల మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపి, హెలిక్యాప్ట‌ర్లు, ప్ర‌త్యేక రోబోట్‌లు, డ్రోన్ల‌తో ఆపరేషన్ చేపట్టాయి. దాదాపు 20 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ప‌దుల సంఖ్య‌లో మావోయిస్టులు చ‌నిపోయారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా

2024 జనవరి నుంచి మొదలుపెట్టిన నక్సల్ మిషన్ 2026ను భద్రతా బలగాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని ఉమ్మడి ఏపీ విశ్రాంత డీజీపీ హెచ్​.జె.దొర అన్నారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. డ్రోన్ల వినియోగం, హెలికాఫ్టర్ల వినియోగంతో కీకారణ్యంలోనూ మావోయిస్టుల జాడ తెలుసుకుని విరుచుకుపడ్డాయని వివరించారు. దండకారణ్యంలో ఏడాదికి పైగా హోరాహోరీగా సాగిన పోరులో భద్రతా బలగాలే పైచేయి సాధించాయని స్ప‌ష్టం చేశారు.

మావోయిస్టు చ‌రిత్ర‌లో..

2024లో జరిగిన ఎన్ కౌంటర్లలో 215 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2025 జనవరి నుంచి మే 21 వరకు 115 మంది హతమయ్యారు. మొత్తంగా మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక్క ఏడాదిన్నరకాలంలో 330 మావోయిస్టులు మృతిచెందడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Leave a Reply