బెంగుళూరులో అప్పగింతల కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం డికె, మంత్రి ఈశ్వర్ ఖండ్రే
తొలి విడతగా అయిదు కుంకీలు స్వీకరణ
త్వరలోనే రానున్న మరో ఏనుగు
కర్నాటక ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్
బెంగళూరు – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి ఫలించింది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించే ప్రయత్నంలో ఆయన విజయం సాధించారు..
బెంగళూరులోని విధాన సౌధాలో నేడు జరిగిన ఒక కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సిఎం డి కె శివకుమార్ లు ఆంధ్రప్రదేశ్‌కు అయిదు కుంకీ ఏనుగుల కు సంబంధించిన పత్రాలను ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కు అందజేశారు.. అలాగే ఆ అయిదు ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, అటవీ పర్యావరణశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అప్పగించారు. ఆ ఏనుగులకు రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్రగా నామకరణం చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సాయం అడిగినా కర్ణాటక ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. కుంకీ ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతామన్నారు పవన్
కుంకీ ఏనుగులు ఏం చేస్తాయ్?
కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమికొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్నిసార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికీ వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మగవాటినే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు ఇవి విశ్రమించవు. కొన్నిసార్లు పంట పొలాలపైకి వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది కూడా. అందుకే పోరాడడంలోనూ వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
కాగా, ఎపిలో ఏనుగుల గుంపులు పంట పొలాలు ధ్వంసం చేయడం, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ సమస్యల నివారణకు కుంకీ ఏనుగులు అవసరం. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ నుంచి కుంకీ ఏనుగులు పొందేందుకు పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం బెంగళూరు వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో సమావేశమై తమ రాష్ట్రంలోని సమస్యను వివరించారు. తమ రాష్ట్రం నుంచి ఆరు కుంకీ ఏనుగులు పంపేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. వాటిని ఈ రోజు అప్పగించడం విశేషం.