- కావాలనే జాప్యం చేస్తున్నారని ఆగ్రహించిన అన్నదాత
- ధాన్యం రాశిపై పెట్రోల్ చల్లి అంటించే యత్నం
- ముందు పోసినవి వెనుకకు.. వెనుకవి ముందుకు
- సిబ్బంది చేతి వాటంతో గోల్ మాల్ చేస్తున్నారని ఆరోపణ
నర్సింహులపేట, మే 3(ఆంధ్రప్రభ) : అధికారుల అలసత్వంతో అన్నదాత ఆగ్రహించి కొనుగోలు కేంద్రంలో సిబ్బంది క్రమ పద్ధతి పాటించడం లేదని చేతివాటం ప్రదర్శించి గోల్ మాల్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. వెనుక తెచ్చిన వారివి ముందు..ముందు తెచ్చిన వారివి వెనుకకు పెడుతున్నారని ఆరోపిస్తూ.. ఓ రైతు ధాన్యం రాశిపై పెట్రోల్ చల్లి తగలబెట్టేందుకు యత్నించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కేంద్రంలో జరిగింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రానికి నర్సింహులపేట గ్రామానికి చెందిన అంకం రామకృష్ణ అనే రైతు తనకున్న ఎకరం పొలంలో వరి పండించి ధాన్యాన్ని అమ్మడానికి కొనుగోలు కేంద్రానికి 25రోజుల క్రితం తీసుకువచ్చాడు. గత ఐదు రోజుల క్రితం మాయిచ్చర్ కూడా వచ్చింది.. కానీ తనవి పెట్టకుండా వెనుక వచ్చిన రెండు మూడు రోజుల క్రితం పోసిన రైతులవి కాంటాలు ఎందుకయ్యాని ప్రశ్నిస్తూ..? తన ధాన్యం రాశిపై పెట్రోల్ పోసి అంటించే క్రమంలో అక్కడున్న రైతులు సిబ్బంది అడ్డుకొని తీసివేసి సముదాయించారు.
అధికారులు స్పందించి సిబ్బంది క్రమ పద్ధతి పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈదురు గాలులు వర్షాభావం వల్ల ఆరబెట్టిన ధాన్యం మళ్లీ తడుస్తుందని మండలం మొత్తం అన్ని గ్రామాల రైతులు కేంద్రానికి తీసుకురావడంతో ఒకటే హమాలీ మూట కాంటాలు పెడుతుండడం కూడా జాప్యానికి కారణమవుతుందని ఇంకా కొంత మంది హమాలీలను సమకూర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కొంత మంది రైతులు డిమాండ్ చేస్తున్నారు.