Exclusive | ఆపరేషన్ మేఘధూత్​ – పాక్​ వక్రబుద్ధికి గుణపాఠం

భారత భూభాగంపై కాలుమోపే యత్నం
జర్మనీ నుంచి ప్రత్యేక డ్రెస్సులకు ఆర్డర్​
ఇండియన్​ స్పై ఏజెన్సీ రాకు సమాచారం
పాక్​ కుట్రపై ఉప్పందించిన డ్రెస్సుల కంపెనీ
పాక్​ కుట్రను భగ్నం చేసేందుకు రంగంలోకి రా
స్పెషల్​ మిషన్​ చేపట్టిన ఇండియన్​ ఆర్మీ
పక్కదేశం కంటే ముందే మంచుకొండల్లో తిష్ట
ఆక్రమణకు వచ్చిన పాక్​ ఆర్మీకి పగలే చుక్కలు
ముష్కరదేశం కుట్రలను తిప్పికొట్టిన‌ రా ఆప‌రేష‌న్‌
తేలుకుట్టిన దొంగ‌లా తోక‌ముడిచిన పాకిస్తాన్‌

సెంట్రల్​ డెస్క్​, ఆంధ్రప్రభ : ప్ర‌పంచంలోనే ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్.. సియాచిన్ గ్లేషియర్​ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్ కుట్రపన్నిన విషయాన్ని భారత స్పై ఏజెన్సీ రా (రీసెర్చ్​ అండ్​ అనాలసిస్​ వింగ్​) పసిగట్టింది. ఇదెలా జరిగిందంటే మంచుకొండల ప్రాంతాలపై చలిని తట్టుకునే ప్రత్యేకమైన మిలటరీ డ్రెస్సులను జర్మనీ నుంచి భారత్ కొనుగోలు చేసింది. అయితే.. పాకిస్తాన్ కూడా అదే కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో వెదర్​వేర్​ కొనుగోళ్లు చేసింది. దీంతో సదరు కంపెనీ ఈ విష‌యాన్ని భారత్​కు ఉప్పందించింది. దీంతో రంగంలోకి దిగిన రా.. పాక్ ఆర్మీకి చెందిన ఫోన్ కాల్స్​ని ఇంటర్​సెప్ట్​ చేసింది. ఇంకేముందు భారత్​ భూభాగాన్ని ఆక్రమించుకోవాలి అనే పాక్ కుట్రలు బయటపడ్డాయి. దీన్ని భగ్నం చేస్తూ మనవాళ్లే ముందుగా అక్కడికి వెళ్లి సియాచిన్​పై త్రివర్ణ పతాకం పాతేశారు. దొంగదెబ్బ తీయాలని నక్కిన పాక్ ఆర్మీని పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేశారు మన జవాన్లు.. ఈ ఆపరేషన్ మోస్ట్ క్రిటికల్ ప్లాన్ అంటారు రా అధికారులు. మొత్తానికి ఆపరేషన్ మేఘధూత్​లో ఒక ఆఫీసర్​ను కోల్పోవాల్సి వచ్చింది. కానీ, ఈ ఆపరేషన్ సక్సెస్ చేసింది మన రా అండ్ ఇండియన్ ఆర్మీ అనేది గర్వంగా చెప్పుకోవాలి.

ఆపరేషన్​లో పాల్గొన్న సైన్యం ఇదే..

ఈ ఆపరేషన్‌లో ఆర్మీ ఉన్నత స్థాయి ప్రధాన అధికారులైన అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ ఎఎస్ వైద్య, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ సిఎన్ సోమన్న, నార్తర్న్ కమాండ్ జీఓసీ-ఇన్-సి లెఫ్టినెంట్ జనరల్ ఎంఎల్ చిబ్బర్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ నరింజన్ సింగ్ చీమా, జిఓసి 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ పిఎన్ హూన్, జిఓసి 3 డివిజన్ మేజర్ జనరల్ శివ్ శర్మ, ఎంజిజిఎస్ నార్తర్న్ కమాండ్ మేజర్ జనరల్ అమర్‌జిత్ సింగ్, 102 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ కమాండర్ బ్రిగేడియర్ జల్ మాస్టర్.. కమాండర్ 26 సెక్టార్ బ్రిగేడియర్ వి చన్నా ఉన్నారు.

ప్రపంచంలోనే కఠినమైన యుద్ధభూమి..

కారకోరం శ్రేణిలోని సియాచిన్ హిమానీనదం పాకిస్తాన్, చైనాతో బోర్డర్​ ఏరియాగా ఉంది. కఠినమైన పరిస్థితులున్న ఈ ఏరియాలో అస్పష్టమైన సరిహద్దుల కారణంగా భారత్​, పాక్​ మధ్య వివాదాలు నెలకొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో భారత సైనికులు పనిచేస్తున్నారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను గౌరవించేందుకు ఏటా ఏప్రిల్ 13వ తేదీన సియాచిన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇండో-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక సియాచిన్ హిమానీనదాన్ని సురక్షితంగా ఉంచడానికి భారత సైన్యం నిరంతరం గస్తీ కాస్తూ ఉంటుంది.

సియాచిన్ వివాదం:

సముద్ర మట్టానికి సగటున 17,770 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్​ హిమానీనదం ప్రాంతంలో కఠినమైన పరిస్థితులుంటాయి. ఇక్కడ మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడ స్పష్టమైన సరిహద్దు లేకపోవడంతొ ఈ ప్రాంతం భారతదేశం, పాకిస్తాన్ మధ్య వివాదానికి కేంద్రంగా మారింది. దేశ విభజన సమయంలో కాశ్మీర్ విషయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల తర్వాత సియాచిన్ వివాదం ప్రారంభమైంది. ప్రారంభంలో ఈ ప్రాంతం నివాసయోగ్యం కాదు. జనావాసాలు లేనిదిగా గుర్తించారు. అందుకని ఇది ఏ దేశం పరిధిలోకి వస్తుందనే విషయంలో అస్పష్టత ఉండేది. రెండు దేశాలు ఇక్కడ తమ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నించాయి. చివరికి ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి సియాచిన్​ భారత్​ సొంతం చేసుకుంది.

సరిపోని ఆక్సిజన్​ లెవల్స్..​

సియాచిన్‌లో మోహరించిన సైనికులు ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు.. కఠినమైన భూభాగం వంటి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సియాచిన్ బాటిల్ స్కూల్‌లో కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. రాక్ క్లైంబింగ్, ఐస్ వాల్ నావిగేషన్ వంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక ఎత్తు, తక్కువ ఆక్సిజన్ స్థాయిల కారణంగా చాలా మంది సైనికులు అనారోగ్యానికి గురయ్యేవారు. సియాచిన్​లో తీవ్రమైన వాతావరణం సైనికుల మరణాలకు కారణంగా మారుతుంది.

సియాచిన్‌లో కఠినమైన జీవితం..

తాగునీటి కోసం మంచు కరిగించడం.. ఆహార సరఫరాలు లేకున్నా మనుగడ సాగించడం వంటి కఠినతరమైన సవాళ్లకు అక్కడ పనిచేసే సైన్యం సిద్ధంగా ఉండాలి. భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి ఉన్నవారికి మాత్రమే ఇక్కడికి సందర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ ప్రాంతంలోని సైనికులు మంచు తుపాను, హిమపాతాలు వంటి అనేక ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతటి ఘోరమైన పరిస్థితులున్నా భారత సైన్యం ఈ ప్రాంతాన్ని కాపాడడానికి.. భారత సరిహద్దులను రక్షించడానికి నిరంతరం పహారా కాస్తూ ఉంటుంది.

Leave a Reply