హైదరాబాద్ – టెన్త్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పదో తరగతి పరీక్షల ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాల్లో 98.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏకంగా 98.7% ఉత్తీర్ణత నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ లో చూసుకోవచ్చు. గతంలో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, సీజీపీఏలు మాత్రమే ఇచ్చే విధానానికి బదులుగా.. ఈసారి రాత పరీక్షలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను విడిగా చూపిస్తూ.. మొత్తం మార్కులు, గ్రేడ్లను మెమోలో చేర్చారు. కనీస మార్కులు వస్తే పాస్ అని, లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదు చేశారు.
రెసిడెన్షియల్ స్కూళ్ల ఫలితాలు భేష్
రాష్ట్ర వ్యాప్తంగా 98.2 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి అనూహ్యంగా ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు కావడం విశేషం. బాలురు 91.32 శాతం, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతను సాధించాయి. 99.29 శాతంతో మహబూబాబాద్ జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. 73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా ఉంది.