Kadambari Case |ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అంజనేయులుకు రిమాండ్ .. జైలుకు తరలింపు

విజయవాడ – బాలీవుడ్ నటి కాదాంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 7 వరకు పీఎస్ఆర్ ను రిమాండ్ కు పంపుతూ నేడు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టైన పీఎస్‌ఆర్ ను అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు బుధవారం ఉదయం థర్డ్ ఏసీజేఎమ్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఛాంబర్‌లో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట లాయర్‌తో కలిసి పీఎస్ఆర్ స్వయంగా వాదనలు వినిపించారు. జెత్వానీ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన పాత్ర లేకపోయినా తన మీద కేసు పెట్టారని వాదించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తనకూ ఈ కేసుకు సంబంధం లేదని పీఎస్‌ఆర్ తెలిపారు.

మాజీ డీసీపీ విశాల్ గున్నిని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్‌గా మారి.. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారని న్యాయమూర్తి ముందు చెప్పుకొచ్చారు. 164 స్టేట్‌మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా ఇవ్వడానికి ఆయన నిరాకరించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన న్యాయమూర్తి ముందు పీఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.ఈ కేసులోని టెక్నికల్ డిటైల్స్ చెప్పుకొచ్చారు. మిగితా నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని.. అసలు రిమాండ్ విధించాలనే దానికి బేస్ లేదన్నారు. రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరుతున్నామని న్యాయవాది నగేష్ రెడ్డి వాదించారు.

నటిపై అక్రమ కేసు: రాజేంద్రప్రసాద్

న్యాయమూర్తి ముందు సీఐడీ తరపున రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే ముంబై నటిపై అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఇదే విషయాన్ని విశాల్ గున్ని కూడా సీఐడీ విచారణలో వెల్లడించారని తెలిపారు. ఆగమేఘాల మీద విశాల్ గున్నిని అప్పటి కమిషనర్ అప్పటి సీఎంవోకు పిలిపించారని న్యాయవాది రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపించారు.

అంతా పీఎస్‌ఆర్‌దే..

ప్రభుత్వ న్యాయవాది సాయి రోహిత్ వాదిస్తూ.. జెత్వానీ కేసులో ప్రణాళిక అంతా పీఎస్‌ఆర్ ఆంజనేయులుదే అని విశాల్ గున్ని స్టేట్‌మెంట్‌ ఇచ్చారని తెలిపారు. విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్నీని డీఐజీగా ప్రమోషన్ ఇచ్చి వైజాగ్ పంపాలని.. అయితే జెత్వనీ కేసు అరెస్ట్‌లు పూర్తి అయ్యాకే పంపుతామని విశాల్ గున్నీని పీఎస్‌ఆర్ బెదిరించారని తెలిపారు. విశాల్ గున్నీ, అప్పటి కమిషనర్ కాంతి రాణాను సీఎంఓకు పీఎస్‌ఆర్ పిలిపించారన్నారు. జెత్వానీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో అనే విషయాన్ని పీఎస్‌ఆర్‌కు తెలియజేశామని విశాల్ గున్నీ అంగీకరించినట్లు చెప్పారు. జెత్వానీపై తప్పుడు కేసు పెట్టి 42 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు. పీఎస్‌ఆర్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెంలో కూడా మరో కేసు నమోదు అయింది అని ప్రభుత్వ న్యాయవాది సాయి రోహిత్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం వాదనలు ముగిశాయి. పీఎస్‌ఆర్‌కు వచ్చే నెల 7 వరకు అంటే 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. పీఎస్‌ఆర్‌కు కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *