న్యూ ఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉషా తో కలిసి భారత్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు భారత్‌లో వాన్స్ దంపతుల పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. నేడు ప్రధాని మోదీతో జేడీ వాన్స్ సమావేశంకానున్నారు.
ఈ సమావేశంలో ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక సంబంధాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అమెరికా టారీఫ్‌లపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి జేడీ వాన్స్ దంపతులకు మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా వాన్స్ ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌లో పర్యటించనున్నారు.
మరోవైపు అచ్చ తెలుగమ్మాయి..
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ సతీమణి ఉషకు అరుదైన కానుకని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఉషావాన్స్‌కు మెమెంటో ఇవ్వనునుంది కేంద్ర రైల్వేశాఖ. ఈ మెమెంటోను ఉషావాన్స్ కు స్వయంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బహూకరించనున్నారు. ఉషావాన్స్ కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా సాయిపురంలో ఉన్నాయి.
1970లో ఉషావాన్స్ తల్లిదండ్రులు అగ్రరాజ్యం అమెరికాకు వలసవెళ్ళారు.మరోవైపు కుటుంబసమేతంగా ఇండియా వస్తున్న వాన్స్ దంపతులు ఏపీకి రావాలంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు ప్రజలు. ఉషా వాన్స్.. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. దీంతో పూర్వీకులు నివసించిన వడ్లూరును సందర్శిస్తారని ఆశిస్తున్నారు అక్కడి గ్రామస్తులు.
80ఏళ్ల క్రితం గ్రామ అభివృద్ధిలో ఉషా వాన్స్ కుటుంబం కీలక పాత్ర పోషించిందని.. చాలా మందికి విద్య అవకాశాలను కల్పించిందని చెబుతున్నారు గ్రామస్తులు. ఎలాగైనా జేడి వాన్స్ కుటుంబం వడ్లూరు సందర్శించేల చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నారు.