TG Govt | ఆశ చూపి దెబ్బ‌కొట్టారు.. ఓపెన్ కాని “రాజీవ్ యువ వికాసం” వెబ్‌సైట్‌!

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : వెనుకబడిన ఎస్సీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోంది. ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ద్వారా ఆర్థిక చేయూత ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. మార్చి 17వ తేదీన ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ సంబంధించిన పోర్టల్ కూడా ప్రారంభమైంది. అయితే.. ముందుగా ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉన్న దరఖాస్తుల గడువును ఏప్రిల్​ 24వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నేపథ్యంలో ఎంపికైన నిరుద్యోగులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన నిధులు మంజూరు చేయనున్నట్టు సీఎం రేవంత్​రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.

రూ.4 లక్షల దాకా రుణ సాయం..

‘రాజీవ్‌ యువ వికాసం’ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందేందుకు ₹4 లక్షల వరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇందులో 80శాతం వరకు రుణ రాయితీ కూడా ఉంది. ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఈ పత్రాలు కలిగి ఉండాలి. ప్రధానంగా ఆధార్, పాన్ కార్డు దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో లబ్ధిదారుని ఫోన్ నెంబర్‌, ఆదాయ ధ్రువీకరణ, రేషన్‌ కార్డు ఉండాలి. అయితే.. రాజీవ్‌ యువ వికాసం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం కుటుంబంలోని ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తోంది.

వ్యవసాయ ఆధారిత వ్యాపారానికి ప్రాధాన్యం..

ప్రధానంగా ఎడ్ల బండ్లు, ఆయిల్ ఇంజిన్ పంప్ సెట్, ఎయిర్ కంప్రెసర్, పత్తి సేకరణ యంత్రం, వేరుశనగ మిషన్, వర్మీ కంపోస్ట్, ఆయిల్ ఫామ్ వంటి ఉపాధి వ్యవసాయ అంశాలకు సంబంధించిన అంశాల్లో రాజీవ్​ యువ వికాసం రుణాలు అందిస్తారు. పశుపోషణకు సంబంధించి గేదెలు, ఆవుల పెంపకం, డెయిరీ ఫామ్​, కోడిగుడ్ల వ్యాపారం, చేపలు, మేకల పెంపకం, పాల వ్యాపారం, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కులాల నిరుద్యోగులకు సొంత వ్యాపారం చేసుకునే ఈ అవకాశం కల్పించనున్నారు.

ఇతర రంగాల వారికీ చేయూత..

ఆటోమొబైల్ షాప్ నిర్వహణ, స్టీల్ వ్యాపారం, ఎయిర్ కూలర్, గాజుల దుకాణంతోపాటు హెయిర్ కటింగ్ షాపు, బ్యూటీ పార్లర్, బట్టల తయారీ, జనరల్ స్టోర్, ఇటుకల తయారీ, డిష్, టీవీ, వడ్రంగి, సీసీ కెమెరాలు రిపేర్ షాప్. ఇవే కాకుండా గోల్డ్ షాప్, జనరేటర్ షాప్, గిఫ్ట్ ఆర్టికల్ షాప్​తో పాటు లాండ్రీ షాపు, డ్రై క్లీనింగ్, లేడీస్ కార్నర్, మినీ సూపర్ బజార్, మటన్, చికెన్ షాప్​లు.. పేపర్ బ్యాగుల తయారీ వరకు అన్ని వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం రుణాలను అందిస్తోంది.

అధికారిక వెబ్​సైట్​లో అప్లయ్​ చేసుకోవచ్చు..

https://tgobmms.cgg.gov.in/

అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2వ తేదీ లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జాబితాను విడుదల చేస్తారు. ₹2 లక్షల వరకు రుణం పొందితే 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ₹4 లక్షల వరకు రుణం తీసుకుంటే 70 శాతం వరకు ప్రభుత్వ రాయితీ పొందుతారు.

ఆశ‌ చూపి దెబ్బ‌కొట్టారు.. ఓపెన్ కాని వెబ్‌సైట్‌

నిరుద్యోగులు, చిరు వ్యాపారుల‌కు రాజీవ్ యువ వికాసం ప‌థ‌కంలో రుణాలు అందిస్తామ‌ని కాంగ్రెస్ స‌ర్కారు ఆశ చూపింది. ద‌ర‌ఖాస్తుల గ‌డువును కూడా పొడిగించింది. కానీ, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ప్రారంభ‌మైంది.. ఈ ప‌థ‌కం కోసం ఆన్ లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల‌ని అనుకునే వారికి ప్ర‌భుత్వం షాక్ ఇచ్చింది. అస‌లు వెబ్ సైట్ ఓపెన్ కాకుండా బ్లాక్ చేసింది. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వారికి This site can’t be reached అనే మెస్సేజ్ వ‌స్తోంది. దీంతో ల‌బ్దిదారులు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఆశ చూపి ఈ విధంగా మోసం చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.. వెంట‌నే వెబ్ సైట్ ప‌ని చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *