.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కంచె గచ్చిబౌలి భూములపై చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్టే మంజూరు చేసింది..
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా కీలకం అయిన అంశమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అంశాలను అమికస్ క్యూరీ.. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు ఉంచింది.
సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చగా.. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటిని ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా, జేసీబీలతో చెట్లను తొలగించే ముందు అయినా సీఈసీ అనుమతి తీసుకున్నారా..? అని నిలదీసింది. రాష్ట్రంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్‌దే బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం
ఒక్కే రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. తమ ప్రశ్నల అన్నింటికి సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని.. తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతగా సుమోటోగా విచారణ చేపట్టామని.. హైకోర్టు రిజిస్ట్రార్ ను ప్రత్యక్ష పరిశీలనకు పంపించి నివేదిక తెప్పించుకున్నామని పేర్కొంది.. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నామని జస్టిస్ గవాయ్ ప్రకటించారు. కాగా,నెల రోజులల ఒక కమిటీ వేసి ఆ భూములపై సర్వే చేయించాలని ఆదేశించింది.. ఆరు నెలల లోపు నివేదిక తమకు చేరాలని కూడా ఆదేశించింది
అన్నీ నిలుపుదల చేయండి..
ఇదే అంశంపై ఈ రోజు పొద్దున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటల్లోగా నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 ఏళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఎక్కడా.. అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాజాగా మరోసారి ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్నీ నిలుపుదల చేయాలని ఆదేశించింది.