Top Story | యహీ జమీన్ కబ్జా.. వక్ఫ్ ఆస్తులే టార్గెట్!

వక్ఫ్ బోర్డుపై లౌకికాస్త్రం రెడీ
కబ్జాకోరులకే కొత్త సర్వే లాభం
58,889 స్థలాలు అన్యాక్రాంతం
₹4.35 లక్షల కోట్ల ఆస్తులు అదృశ్యం
కోర్టు బోనులో ₹13వేల కోట్ల ఆస్తి
వ్యతిరేకిస్తున్న ముస్లిం వర్గాలు
ఫైనల్​ చేసేందుకు కేంద్రం సన్నద్ధం
లోక్​సభ నిర్ణయమే తుది తీర్పు

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :

లక్షల కోట్ల విలువ చేసే వక్ఫ్ బోర్డు ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సచార్ కమిటీ నివేదిక బూజును దులిపింది. ఈ వక్ఫ్ చట్టం సంప్రోక్షణకు కంకణం కట్టుకుంది. ఈ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపారు. జేఏసీ ప్రతిపాదనలతో వక్ఫ్ సవరణ 2024 బిల్లు ఆమోదం కోసం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెడుతోంది. ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించామని, అవసరమైతే మరింత పొడిగిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిర‌ణ్‌ రిజిజు అన్నారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందో.. లేదో.. అసలు వక్ఫ్ చట్టం సవరణకు దారి తీసిన స్థితి గతులేంటీ? అసలు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ ఆస్తుల మీద వివాదాలు ఏంటి?.. కేంద్రం చెబుతున్న సంస్కరణలు ఏంటి? వ్యతిరేక వర్గాల వాదనలు ఏంటీ? చ‌దివి తెలుసుకుందాం..

వక్ఫ్ అంటే ముస్లిం హితం

ఇస్లాం సంప్రదాయంలో, ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్‌ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయి. వీటిని అమ్మడం లేదా సొంత ప్రయోజనాలకు ఉపయోగం నిషేదం. అందుకే వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. 12వ శతాబ్ధంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ఢిల్లీ సుల్తానుల పాలనలో భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయానికి బీజం పడింది. ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులు, ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు.

అన్యాక్రాంతానికి అంకురం..

దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 8,72,351వక్ఫ్ ఆస్తులున్నాయి. ఇవన్నీ 9,40,000 ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ ₹1.20 లక్షల కోట్లు
ఇక వక్ఫ్‌ బోర్డుల్లో అవినీతి జాడ్యం మితిమీరింది. ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. అనేక మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆస్తుల్లో గణనీయ భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని ఆరోపణలు కోకొల్లలు.

గుర్తుతెలియని వ్యక్తుల కబ్జాలో…

దేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరమని సూచించింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే ఏటా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం ₹ 200 కోట్లే. వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది.

వివాదాల్లో 13వేల కోట్ల ఆస్తులు..

“గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉంది” అని అధికారులే రికార్డుల్లో నమోదు చేసిన వందల కొద్దీ ఘటనలను తన నివేదికలో నమోదు చేసింది. సుమారు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 13వేల కోట్ల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు. సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు.

వివాదం ఎందుకు?

రెండేళ్లలో దేశంలోని వివిధ హైకోర్టుల్లో వక్ఫ్‌ ఆస్తులపై దాదాపు 120 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ చట్టంలో సవరణలు ప్రతిపాదించారు. వక్ఫ్ చట్టానికి చేస్తున్న మార్పులపై అనేకమంది ముస్లింలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం గురించిన నిబంధనలు. ఇది బోర్డుల ఆధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల కిందటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవు. మరి కొన్నింటిని నోటి మాటగా దానం ఇచ్చారు. దీంతో చట్టపరమైన పత్రాలు అందుబాటులో లేవు. పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్ ( వినియోగించుకుంటున్న వ్యక్తి) కేటగిరీ కిందకు వస్తాయని 1954 వక్ఫ్ చట్టం గుర్తించింది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది అగమ్యగోచరంగా మారింది.

సవరణ ప్రతిపాదనలు.. అసదుద్దీన్​ ఏమంటున్నారు..

వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ఇతర మార్పులతో పాటు వక్ఫ్ ఆస్తులను బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్‌దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు.ఈ సవరణతో వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు. ముస్లింల నుంచి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపిస్తున్నారు. వక్ఫ్ చట్టంలో మార్పుల్లో మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్‌ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు. అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరూ ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్‌ బోర్డుకు చెందుతుంది. కొన్ని మార్పుల వల్ల ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాలి. అనేకమంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్లు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వీరికి ఒక ఛాన్స్ లభిస్తుంది” అని ఒవైసీ వాదిస్తున్నారు.

Leave a Reply