తొలి విడత చందనం అరగదీత ప్రారంభం

సింహాచలం, ఆంధ్రప్రభ : ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఈ నెల 20న జరగనున్న చందనోత్సవం కోసం సన్నాహాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈసారి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ఈవో జే. వెంకటరావు ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

చందనోత్సవం రోజు రాత్రి భక్తుల దర్శనాల అనంతరం సింహాద్రినాథుడికి తొలి విడతగా మూడు మనుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వైశాఖ మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ఈవో జే. వెంకటరావు, ఏఈఓ తిరుమలేశ్వరరావు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా అర్చక వర్గం చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సింహాద్రినాథుడి మహిమాన్విత ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
