విద్యార్థుల గొడవ.. కుటుంబాల మధ్య రగడ

రాయపోల్, ఆంధ్రప్రభ : చిన్నపాటి విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చివరకు కుటుంబాల మధ్య ఘర్షణగా మారిన ఘటన మండలంలోని దొడ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బంటు భాను కుమార్తె తన తోటి విద్యార్థి శ్రవణ్ గురించి చాడీలు చెబుతుండటంతో, ఈ విషయాన్ని శ్రవణ్ తన అన్న రాకేష్‌కు తెలియజేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన రాకేష్, బాలికను చేతులతో కొట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న భాను, తన తమ్ముడు సుభాష్‌తో కలిసి రాకేష్ ఇంటికి వెళ్లి వివరణ కోరగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో రాకేష్ తల్లిదండ్రులు పిట్ల స్వామి, మంజుల కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో భాను, సుభాష్‌లకు తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న రాయపోల్ ఎస్ఐ మానస సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితుల ఫిర్యాదు స్వీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మానస తెలిపారు.
