మల్బరీ తోటను సందర్శించిన ఎంపీడీవో

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టు పురుగుల మల్బరీ తోటను శుక్రవారం ఎంపీడీవో సునీత, ఈజీఎస్ ఏపీఓ జయదేవ్ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పట్టు పురుగుల పెంపకం విధానంపై మండల టెక్నికల్ అసిస్టెంట్ డి. రాములు నుండి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్ డి. రాములు మాట్లాడుతూ, మల్బరీ తోట ఏర్పాటుకు రైతులకు బోర్ లేదా బావి ఉండాలని, సుమారు 2 ఎకరాల్లో మల్బరీ తోటను ఏర్పాటు చేసి, ఎకరానికి 5 వేల మొక్కలు నాటవచ్చని తెలిపారు. అవసరమైన మొక్కలను ఎల్లాపూర్ నుండి సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
పట్టు పురుగుల పెంపకం కోసం షెడ్ నిర్మాణానికి సుమారు రూ.4.50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
పట్టు పురుగుల పంట పండడానికి సుమారు ఒక నెల సమయం పడుతుందని, సంవత్సరానికి 6-7 పంటలు సాధ్యమవుతాయని చెప్పారు. పట్టు పురుగుల పెంపకం తక్కువ పెట్టుబడితో, మంచి లాభాలు అందించే వృత్తి కాబట్టి రైతులు ఈ దిశగా ముందుకు రావాలని ఆయన కోరారు.
