ఆన్‌లైన్లో తప్ప ఇసుక రవాణా లేదు

ఆన్‌లైన్లో తప్ప ఇసుక రవాణా లేదు

  • నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
  • కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఇసుక రవాణా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. “మన ఇసుక – మన వాహనం” పోర్టల్ ద్వారా అనుమతులు పొందిన వాహనాలకే ఇసుక తరలింపునకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, వంగూరు మండలాల్లో మొల్గర, పెదాపూర్, ఉల్పర గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక రీచ్‌లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఇసుక తవ్వకం, రవాణా విధానాలను పరిశీలించి, స్థానిక అధికారులు, ప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఇసుక రవాణా పూర్తిగా పారదర్శకంగా ఉండేందుకు ప్రతి వాహనం ప్రయాణ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆయన ఆదేశించారు. రాత్రి వేళల్లో కూడా సీసీ ఫుటేజీని పరిశీలిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు లేదా రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ విధానం అమలుతో ఇసుక పంపిణీలో పారదర్శకత పెరిగి అక్రమాలు తగ్గుతాయని, ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులోకి వస్తుందని, అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కలెక్టర్ వెంట ఉప్పునుంతల, వంగూరు మండలాల రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply