రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్…

రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్…

రాష్ట్ర మంత్రి డా. పి. నారాయణ

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలోని పుర, నగరపాలక సంఘాల పరిధిలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీటి సరఫరా కల్పించేందుకు రూ.14 వేల కోట్లతో విస్తృత స్థాయిలో పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి డా. పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చిత్తూరు నగరంలో ప్రధాన రహదారుల విస్తరణ పనులు సక్రమంగా జరుగుతున్నాయని ప్రశంసించారు. భవిష్యత్ అవసరాలు, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా రోడ్ల అభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు.

పుర, నగరపాలక సంస్థల్లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పార్కులు వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. అమృత్, యూఐడీఎఫ్ నిధులతో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ అందించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 123 పుర, నగరపాలక సంస్థల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీలు) నిర్మించేందుకు రూ.39.21 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికన మురికినీటి కాలువల నిర్మాణానికి రూ.29 వేల కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసి, మొదటగా అధిక మరియు మధ్యస్థ జనాభా ప్రాంతాల్లో రూ.9 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలో కాలువల నిర్మాణానికి రూ.82 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పిస్తూ చెత్త పన్ను విధించి, డంపింగ్ యార్డుల్లో చెత్తను పేరుకుపోయేలా వదిలేసి వెళ్లారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 153 లక్షల టన్నుల లెగసి వ్యర్థాలను తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తిరుపతిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం పూర్తికి చేరువలో ఉందని, అది అందుబాటులోకి వస్తే చిత్తూరు నగర వ్యర్థాలను అక్కడికి తరలించనున్నట్లు తెలిపారు.

టిడ్కో గృహాల పంపిణీపై మాట్లాడుతూ ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులకు గృహాలు అందజేశామని, జూన్ నాటికి మరో 40 వేల గృహాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నగరపాలక సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులను వేగవంతం చేసి భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ప్రోత్సహించాలన్నారు. ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఆదాయ వనరులను పెంచాలని సూచించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం చేయకుండా ట్యాక్స్ పరిధిలోకి రాని ఆస్తులను గుర్తించి వసూలు చేయాలని ఆదేశించారు.

సీడీఎంఏ సంపత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా యుఎల్బీల్లో సమస్యలను స్వయంగా గుర్తించి పరిష్కార మార్గాలు సూచించేందుకు మంత్రి పర్యటిస్తున్నారని తెలిపారు. ట్యాక్స్ పెంచకుండా గత ఏడాదితో పోల్చితే 20 శాతం అదనపు ఆదాయం సాధించామని చెప్పారు.

ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ అమృత్-2, యూఏడీఎఫ్ పథకాల ద్వారా కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, చిత్తూరులో ఎస్టీపీ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్, నగరపాలక ప్రత్యేక అధికారి సుమిత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో నగరంలో రహదారుల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి మార్కెట్ యార్డులో స్థలం గుర్తించినట్లు, త్వరలోనే అప్పగించనున్నట్లు తెలిపారు. అడవిపల్లి నుంచి నీటి సరఫరా పనులు మరో ఆరు నెలల్లో పూర్తవుతాయని తెలిపారు.

ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని మంత్రి ద్వారా ముఖ్యమంత్రిని కోరారు. నగరపాలక సంస్థలో ఉద్యోగుల స్థాయిని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ బస్టాండ్ రోడ్డును మోడల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాలువల నిర్మాణం, వీధి దీపాలు, డ్రైనేజీ పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు. మినీ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మంత్రి పర్యటన సందర్భంగా మురుకంబట్టు వద్ద ఘన స్వాగతం లభించింది. అనంతరం సంతపేట డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పూణేపల్లి వద్ద టిడ్కో గృహాలను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply