క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..

క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..

ఈస్టర్ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

భవానిపురం, ఆంధ్రప్రభ : ఏసుక్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితార సెంటర్ సమీపంలోని ఏజీ చర్చిలో ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎంపీ చిన్ని హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ముందుగా క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. బిషప్ చార్లెస్ జాకోబు ఈస్టర్ సందేశాన్ని అందించారు. పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ తోపాటుగా ప్రతి ఒక్కరి శ్రేయస్సు, అభివృద్ధి కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాద్ ( చిన్ని) మాట్లాడుతూ…..యేసుక్రీస్తు మరణాన్ని జయించి మూడవ రోజున తిరిగి లేచిన (పునరుత్థాన) మహోన్నత దినమే ఈస్టర్ అన్నారు. ఈస్టర్ పండుగ నిరాశపై ఆశకు, చీకటిపై వెలుగుకు, పాపంపై నీతికి విజయానికి సంకేతమని తెలిపారు. ఈస్టర్ ప్రేమ, త్యాగం, క్షమాగుణం, నిత్యజీవం యొక్క నిరీక్షణను ఈస్టర్ బోధిస్తుందని అన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి టిడిపి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంలో ఎంపీ చిన్ని తెలిపారు. విజయవాడ నగరంలో ఈస్టర్, క్రిస్మస్, దసరా, రంజాన్ వంటి అన్ని పండుగలు కులమతాలకు అతీతంగా సర్వమత సౌభ్రాతృత్వాన్ని కాంక్షించేలా జరుగుతాయన్నారు.

అన్ని మతాలవారు కలిసిమెలిసి ఉంటారని అదే విజయవాడ నగర విశిష్టత అన్నారు. ఇటువంటి మహానగరంలో పుట్టడం, ఎంపీగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవ మత పెద్దలతో పాటుగా టిడిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, 35 వ డివిజన్ నాయకులు చార్లెస్, టీడీపీ నాయకులు నరసింహ చౌదరి, మైలవరపు కృష్ణ , గొల్లపూడి మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ పాల మాధవ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply