GHMC Council: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లందరూ హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ కు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పట్టుబట్టింది. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల అరుపులు, కేకలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి చెప్పినా సభ్యులు వినలేదు. ఆమెతో వారించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. సీట్లలో నుంచి పైకి బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. మేయర్ రాజీనామా చేయాలంటూ ఆమె పోడియంను చుట్టుముట్టారు. గ్రేటర్‌పై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. మాటామాట పెరిగింది. కాంగ్రెస్ హామీలపై జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ నిలదీశారు. వెంకటేశ్ చేతిలో ఉన్న ప్లకార్డులను కాంగ్రెస్ కార్పొరేటర్లు లాక్కుని చించివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ నుంచి కార్పొరేటర్లను బయటకు పంపించారు. మార్షల్ ద్వారా వాళ్లను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బయటకు పంపారు. ఈ క్రమంలో మరింత ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకోవడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అయితే ప్రభుత్వానికి ప్రశ్నించినందుకు తమను అదుపులోకి తీసుకుంటారా అని మహిళా కార్పొరేటర్లు మండిపడ్డారు. తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ అంబర్ పేట కార్పొరేటర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు సైతం నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయిందని మండిపడ్డారు. నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత శ్రవణ్ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. డివిజన్లవారీగా కార్పొరేటర్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కొద్దిసేపు వాయిదా వేసినప్పటికీ ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. మేయర్ మధ్యాహ్నం తర్వాత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.