ప్రేమ, క్షమాగుణం మన జీవన మార్గం కావాలి..

ప్రేమ, క్షమాగుణం మన జీవన మార్గం కావాలి..

  • క్రీస్తు త్యాగం మానవాళికి మార్గదర్శకం..
  • శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందిద్దాం..
  • తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

తిరువూరు, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన సందేశంలో గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను వివరించారు. యేసుక్రీస్తు శిలువ పై చేసిన మహా త్యాగం, మానవాళి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను స్మరించుకునే పవిత్ర దినమే గుడ్ ఫ్రైడే అని పేర్కొన్నారు. మన పాప పరిహారార్థం క్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రేమ, క్షమాగుణం, త్యాగనిరతి వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అలవర్చుకోవాలని సూచించారు.

యేసుక్రీస్తు చూపిన మార్గం మనిషిని మంచితనానికి, సేవాభావానికి నడిపించే దారిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ పవిత్ర దినం గుర్తు చేస్తుందని అన్నారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ప్రేమతో ముందుకు సాగడం, క్షమాగుణాన్ని అలవరచుకోవడం ద్వారా సమాజంలో మంచి మార్పుకు ప్రతి ఒక్కరూ కారణం కావాలని పిలుపునిచ్చారు. యువత యేసుక్రీస్తు ఆదర్శాలను అనుసరించి సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ పరిశుద్ధ శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంటా శాంతి, ఆనందం నెలకొనాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply