అద్విక ట్రేడింగ్ స్కామ్‌లో మరొకరి అరెస్ట్

అద్విక ట్రేడింగ్ స్కామ్‌లో మరొకరి అరెస్ట్

డిపాజిటర్లను మోసం చేసిన ఏజెంట్‌ ఖాజావళి అరెస్ట్
కోటి రూపాయలకుపైగా నష్టం; కోట్లలో లాభాలు దక్కించుకున్నట్లు ఆరోపణలు

ఆంధ్రప్రభ బ్యూరో, ఎన్టీఆర్ : విజయవాడ నగరంలో సంచలనం రేపిన అద్విక ట్రేడింగ్ స్కామ్ కేసులో పోలీసులు మరో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రోకళ్ళపాలెంకు చెందిన మొహమ్మద్ ఖాజావళి (43)ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.పోలీసుల వివరాల ప్రకారం, ఖాజావళి అద్విక ట్రేడింగ్ కంపెనీకి ఏజెంట్‌గా పనిచేస్తూ పలువురు డిపాజిటర్లను ఆకర్షించాడు.

అతని ద్వారా మొత్తం 9 మంది డిపాజిటర్లు సుమారు రూ.1.54 కోట్ల పెట్టుబడులు పెట్టగా, వారికి దాదాపు రూ.22 లక్షల నష్టం జరిగినట్లు వెల్లడైంది.ఖాజావళి తనకు వచ్చిన ఏజెంట్ కమిషన్‌తో పాటు వ్యక్తిగత పెట్టుబడులపై వచ్చిన వడ్డీ మొత్తంలో కొంత భాగాన్ని తీసుకుని, మిగతా మొత్తాన్ని మళ్లీ అద్విక ట్రేడింగ్ కంపెనీలోనే పెట్టుబడిగా మళ్లించినట్లు విచారణలో బయటపడింది. ఈ విధంగా అతను మొత్తం రూ.1.12 కోట్లను తిరిగి కంపెనీలో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.


అయితే, కంపెనీ నుంచి అతనికి మొత్తంగా సుమారు రూ.3.39 కోట్ల వరకు రాబడులు వచ్చినట్లు సమాచారం. అంటే, అతను పెట్టిన మొత్తాన్ని మించి దాదాపు రూ.2.26 కోట్ల అదనపు లాభం పొందినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ అదనపు లాభాలతో ఖాజావళి కంపెనీ నుండి బయటకు వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.


తదుపరి కాలంలో ఖాజావళి చిత్తూరు జిల్లా కేంద్రంగా పనిచేసిన క్యూనిక్స్ ట్రేడింగ్ కంపెనీలో కూడా తాడేపల్లి కార్యాలయం ద్వారా ఏజెంట్‌గా కొనసాగి, అక్కడ కూడా డిపాజిట్లను సేకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ సంస్థ కూడా తరువాత మూతపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని, డిపాజిటర్లను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a Reply