వైభవంగా సామూహిక వివాహాలు..

వైభవంగా సామూహిక వివాహాలు..

మడకశిర రూరల్, ఆంధ్రప్రభ : శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక వివాహ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 24 జంటలు ఒక్కటయ్యాయి. లోకకళ్యాణాన్ని సంకేతంగా సూచించే సీతారాముల కళ్యాణంతో పాటు జరిగిన ఈ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, సేవాభావాల సమ్మేళనంగా నిలిచింది. రఘువీరారెడ్డి దంపతులు స్వయంగా ముందుండి ఉచితంగా వివాహాలు జరిపించడం ద్వారా ఆదర్శంగా నిలిచారు.

వివాహ వేడుకల్లో భాగంగా కొందరు వధూవరులు తమ సాంప్రదాయం ప్రకారం గుర్రాలపై ఊరేగింపుగా కళ్యాణ వేదికకు చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా హెచ్.ఆర్. పాళ్యంకు చెందిన మంజునాథ్–సంకమ్మ జంట గుర్రంపై రాక భక్తులను, గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. నంజవధూత స్వామీజీ సమక్షంలో రఘువీరారెడ్డి దంపతులు ప్రతి జంటకు నూతన వస్త్రాలు, మంగళసూత్రాలను అందజేశారు. అనంతరం వధూవరుల బంధుమిత్రులకు, భక్తులకు ఆలయ ప్రాంగణంలో భారీగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ… “1982లో మా పెదనాన్న స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీరామిరెడ్డి ప్రారంభించిన ఈ సేవా యజ్ఞాన్ని గత 44 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు 4,500 పైగా జంటలకు వివాహాలు జరిపించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది” అని తెలిపారు.

వివాహాల అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో రఘువీరారెడ్డి దంపతులు స్వయంగా కోలాటం ఆడి భక్తులను ఉత్సాహపరిచారు. పల్లె సంస్కృతిని ప్రతిబింబించే ఈ నృత్యం వేడుకకు ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply