Fire accident | అగ్గిరాజుకుంటే బుగ్గే..

Fire accident | అగ్గిరాజుకుంటే బుగ్గే..

ప్రైవేట్ బ‌స్సుల్లో ప్ర‌యాణం సేఫేనా..?
త‌ర‌చూ అగ్ని ప్ర‌మాదాలు
యంత్రాల వైఫల్యం, షార్ట్ సర్క్యూట్‌లు..
ఇంజన్ వేడెక్కడం, టైర్లు పేలడంతో మంట‌లు
ఆందోళ‌న‌లో ప్ర‌యాణికులు
కొర‌వ‌డిన అధికారుల నిఘా
భ‌ద్ర‌త‌ను ప‌ట్టించుకోని ట్రావెల్స్ య‌జ‌మానులు

Fire accident | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇటీవ‌ల జ‌రుగుతున్న బ‌స్సు ప్ర‌మాదాలు ప్ర‌యాణికుల‌ను భ‌య‌పెడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ప్రైవేట్ బస్సుల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాల్లో జరిగిన బస్సు ప్రమాదాలు, ప్రయాణికులు సజీవ దహనమైన ఘటనలు రవాణా శాఖల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో జరిగిన దుర్ఘటన ఇందుకు నిద‌ర్శ‌నం. బ‌స్సుల‌పై అధికారుల నిఘా కొర‌వ‌డింద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. బ‌స్సుల్లో యంత్రాల వైఫల్యం, షార్ట్ సర్క్యూట్‌లు, నిబంధనలకు విరుద్ధమైన లోడ్ కార‌ణంగా మంటలు చెల‌రేగి ప్రాణనష్టం క‌లుగుతోంది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అదనపు బెర్తుల కోసం అత్యవసర ద్వారాలను మూసివేస్తున్నారు. లగేజీ క్యాబిన్లలో ఎల్‌పిజి సిలిండర్లు, పెట్రోల్ వంటి మండే పదార్థాలను తరలిస్తున్నారు. ఇంజన్ వేడెక్కడం, షార్ట్ సర్క్యూట్‌లు, టైర్లు పేలడం త‌దిత‌ర కార‌ణాల‌తో ప్ర‌మాదాలుచోటుచేసుకుంటున్నాయి. ఈ-బస్సుల్లో లిథియం-అయాన్ బ్యాటరీల నిర్వహణ లోపాల వల్ల థ‌ర్మ‌ల్ ర‌న్ అవే జరిగి మంటలు చెలరేగుతున్నాయి. బస్సు బాడీ బిల్డింగ్‌లో నాణ్యత లేని వైరింగ్, అత్యవసర ద్వారాలు, మంటలను ఆర్పే పరికరాలు లేకపోవడం కూడా ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతున్నాయి.

అధికారులు ఇప్ప‌టిక‌ప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బ‌స్సుల్లో త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ప్రయాణానికి ముందు బస్సులో అత్యవసర ద్వారాలు తెరిచి ఉన్నాయో లేదో తనిఖీ చేయాంటున్నారు. బస్సు అద్దాలు పగలగొట్టడానికి హ్యామర్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడాటంటున్నారు. బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లపై, నిబంధనలకు విరుద్ధంగా లగేజీ తరలించే వాహనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

మంటలు వేగంగా వ్యాపించడానికి కారణాలు
ఇంజిన్ అధిక వేడి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్, మండే పదార్థాలు, ఇంధన లీకేజీ వంటివి బస్సుల్లో అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణాలు. ఇక బస్సుల్లో మండే స్వభావం కలిగిన పదార్థాలతో తయారైన వస్తువులు అధికంగా ఉంటాయి. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనంతో పాటు ప్లాస్టిక్, రెగ్జిన్ కవర్ సీట్లు ఉంటాయి. ఈ పదార్థాలు గాలితో కలిసి త్వరగా మంటలు అంటుకుని, వేగంగా వ్యాప్తి చెందడానికి దోహదపడతాయి. బస్సులలో సరైన అగ్నిమాపక వ్యవస్థలు లేకపోవడం ప్రమాదాల తీవ్రతకు అద్దం పడుతోంది. అప్పటికప్పుడు మంటలు ఆర్పేందుకు తగిన వ్యవస్థ లేకపోవడం ప్రాణ నష్టానికి దారి తీస్తోంది.

అధికారులు తీసుకోవాల్సిన చర్యలు:
బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను కఠినంగా తనిఖీ చేయాలి. ముఖ్యంగా స్లీపర్ బస్సుల బాడీ బిల్డింగ్‌లో నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలి. సుదూర ప్రయాణాలు చేసే డ్రైవర్లకు కనీసం 8 గంటల విశ్రాంతి ఉండేలా చూడాలి. నిద్రమత్తును నివారించడానికి డ్రైవర్ల పని వేళలను పర్యవేక్షించాలి. వేగ నియంత్రణకు ప్రతి బస్సులో GPS/ట్రాకింగ్ సిస్టమ్స్ తప్పనిసరి చేయాలి. ఓవర్ స్పీడింగ్ చేస్తే వెంటనే అలర్ట్ వచ్చేలా వ్యవస్థ ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. బస్సుల్లో తప్పనిసరిగా ఫైర్ ఎక్స్‌టింగ్యూషర్లు ఉండేలా చూడాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలు పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలి. బస్సుల్లో అక్రమంగా అదనపు సీట్లు, ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించే మార్పులను గుర్తించి సీజ్ చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక నిఘా ఉంచి, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

Leave a Reply