15 ఏళ్ల నిరీక్షణకు తెర….

15 ఏళ్ల నిరీక్షణకు తెర….
రామవరప్పాడులో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే యార్లగడ్డ
విజయవాడ రూరల్ – ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కట్టపై రహదారి సమస్యకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిష్కారం చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఈ ప్రాంతంలో బీటీ (BT) రోడ్డు పనులను స్థానిక కూటమి నాయకులతో కలిసి ప్రారంభించి, పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు ప్రాంతాల్లో కట్టలపై నివసిస్తున్న సుమారు 20 వేల మందికి రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇంతకాలం సరైన రహదారి లేక ప్రజలు హైవేకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో పని చేసిన ప్రజా ప్రతినిధులకు ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, అయితే యార్లగడ్డ వెంకట్రావు గెలిచిన వెంటనే స్పందించి పనులు ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వారి దీర్ఘకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిపై కూడా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.

సిఎస్ఆర్ (CSR) నిధులతో రామవరప్పాడులో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మోడ్రన్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా, పేద ప్రజలకు తక్కువ ధరలో భోజనం అందించేందుకు త్వరలోనే అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
