entry in 2021| ఐదేళ్ల క్రితం కల నిజమైంది..

entry in 2021| ఐదేళ్ల క్రితం కల నిజమైంది..
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
2021లో పొట్టి ఫార్మట్ ద్వారా అరంగేట్రం
అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి ఐదేళ్లు పూర్తి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8న న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత జట్టు వరుసగా రెండోసారి పొట్టి కప్‌ను ఒడిసిపట్టింది. మరే ఆతిథ్య జట్టుకు సాధ్యమవ్వని విధంగా.. సొంతగడ్డపై పొట్టి వరల్డ్‌కప్‌ను పట్టేసింది. సారథిగా దేశానికి వరల్డ్‌కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ దిగ్గజాల సరసన చేరాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ట్రోఫీని నిలబెట్టుకున్న మొదటి జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించడంలో కీలకమైన ఈ మిస్టర్ 360 ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన వీడియోను షేర్ చేస్తూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. భారత జెర్సీని ధరించడం అనేది ఒక గొప్ప అనుభూతి అని, ఐదేళ్ల క్రితం తన కలను నిజం చేసుకున్న ఆ క్షణాన్ని మాటల్లో వర్ణించలేనని సూర్య పేర్కొన్నాడు.

సరిగ్గా ఐదేళ్ల క్రితం, 2021 మార్చి 14న అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా సూర్య అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటికి ఆయన వయస్సు 30 ఏళ్లు దాటినప్పటికీ, క్రీజులోకి వచ్చిన మొదటి బంతినే సిక్సర్‌గా మలచి తనదైన శైలిలో కెరీర్‌ను ప్రారంభించాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టును కెప్టెన్‌గా నడిపించి విశ్వవిజేతగా నిలపడం, అదే అహ్మదాబాద్ వేదికపై ట్రోఫీని అందుకోవడం ఆయన కెరీర్‌లో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.

సూర్యకుమార్ యాదవ్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 113 మ్యాచ్‌లు ఆడి 3,272 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల తర్వాత సూర్య మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. 2021లో వన్డేల్లోకి, 2023లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, 2022లో ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
