Vaccination | ఇది కాటు కాదు… ప్రాణాంత‌కం…

Vaccination | ఇది కాటు కాదు… ప్రాణాంత‌కం…

Vaccination | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ సమస్య విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పిల్లలను బయటకు పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. స్కూళ్లకు వెళ్లే మార్గాల్లో, కాలనీల్లో శునకాల దాడులు జరగడం తల్లిదండ్రులను కలవరపెడుతోంది. మొత్తంగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో వీధి శునకాల సమస్య ఇప్పుడు కేవలం జంతు నియంత్రణ సమస్యగా కాకుండా, ప్రజారోగ్య సంక్షోభంగా మారింది.

ఈ సమస్యపై స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నా, అవి సరిపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వంటి సంస్థలు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, వీధి కుక్కల సంఖ్య తగ్గడం లేదు. మరోవైపు, చాలామంది అవగాహన లేక “ఏమి కాదులే” అని భావించి ఆలస్యంగా వైద్యం తీసుకుంటున్నారు. దీంతో పరిస్థితి విషమించి కొందరు మృతిచెందుతున్నారు. వైద్యులు మాత్రం కుక్క కాటు జరిగిన వెంటనే గాయాన్ని శుభ్రం చేసి, పూర్తిస్థాయి వ్యాక్సిన్ కోర్సు తీసుకోవాలని పదే పదే హెచ్చరిస్తున్నారు. చిన్న గాటు కూడా గాయంగా మొదలై కొందరిలో తీవ్ర ఇన్ఫెక్షన్లకు, మరికొందరిలో ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తోంది. ముఖ్యంగా రేబీస్ వ్యాధి భయం ప్రజలను వెంటాడుతోంది.

Vaccination |

రేబీస్ సోకిన వ్యక్తి కుక్కలాగా ప్రవర్తించడం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. కాటు తర్వాత సకాలంలో వైద్యం తీసుకోని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఎందరో కుటుంబాలను విషాదంలోకి నెట్టేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా రేబీస్ నియంత్రణకు వ్యాక్సినేషన్, అవగాహన చాలా ముఖ్యమని సూచిస్తున్నాయి.

Vaccination | ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడండి…

సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నా జంతు ప్రేమికులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు శునకాలను హింసించకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించాలని కోరుతున్నారు. ఒకవైపు ప్రజల ప్రాణ భద్రత, మరోవైపు జంతు హక్కులు, ఈ రెండింటినీ రక్షించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూ, జంతువులకు హాని చేయకుండా ముందుకు వెళ్లడమే ఇప్పుడు ప్రభుత్వాల ముందు ఉన్న పెద్ద సవాలుగా మారింది.

Leave a Reply