Open drinking | నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి…

Open drinking | నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి…
కఠినంగా వ్యవహరించాలి – ఎస్పీ విక్రాంత్
Open drinking | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పని చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్న నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి న్యాయం చేయాలని సూచించారు.
నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేస్తేనే పోలీసు శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. కార్డన్ సెర్చ్‌లు, రాత్రి గస్తీలు, రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, పల్లె నిద్ర కార్యక్రమాలు, గ్రామాల సందర్శనలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.

అవసరమైతే బైండోవర్ కేసులు, పీడీ యాక్టులు నమోదు చేయాలని, ప్రజా శాంతికి భంగం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణలు అమలు చేయాలని సూచించారు. డీజీపీ గారు చేపట్టిన “వజ్ర ప్రహర్” కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ప్రతి సబ్ డివిజన్‌లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాలని తెలిపారు. డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ చేయించి అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, రోడ్డు ప్రమాదాలు, మిస్సింగ్, చీటింగ్, దొంగతనాలు, ప్రాపర్టీ కేసుల పురోగతిపై సమీక్షించారు.

దొంగతనాలు, ప్రాపర్టీ కేసులు త్వరితగతిన చేధించి రికవరీలు పెంచాలని సూచించారు. పోక్సో కేసుల్లో నిర్దేశిత సమయంలోపు ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల బారిన పడి లక్షల రూపాయలు కోల్పోయిన బాధితుల ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. పెండింగ్ కేసుల దర్యాప్తును పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద అర్ధరాత్రి తర్వాత హెవీ వాహనాల డ్రైవర్లకు “స్టాప్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ రాత్రి గస్తీ తిరిగే పోలీసులు రేడియం జాకెట్లు, ఎల్‌ఈడీ బ్యాటన్లు ధరించాలని సూచించారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బంది, డిపిఓ మినిస్టీరియల్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు బాబు ప్రసాద్, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, హేమలత, భార్గవి, డిపిఓ ఏఓ విజయలక్ష్మీ, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
