నంద్యాల బ్యూరో, మార్చి 15 ఆంధ్రప్రభ : నంద్యాలను నందనవనంగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతినెలా మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్నినంద్యాలలో శనివారం నిర్వహించారు. నంద్యాల పట్టణం చిన్నచెరువు వద్ద రాష్ట్ర అధికారులు ఘనంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్చార్జి స్పెషల్ అధికారి జె.నివాస్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీసాలు పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రత, స్వచ్ఛతగా ఉండాలని, అందుకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి ఆంధ్రప్రదేశ్ ను హరితవనంగా రూపొందించాలని పేర్కొన్నారు.
అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛాంధ్ర నినాదాలు చేపట్టారు. ప్లాస్టిక్ కవర్లు వద్దు – కాటన్ సంచి ముద్దు, పచ్చదనం పకృతి ధనం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. మానవహారంలో స్వచ్ఛాంధ్ర పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం చెరువుగట్టుపై పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
