TG | ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి..

TG | ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
TG, హసన్ పర్తి, ఆంధ్రప్రభ : యాసంగిలో పంటలకు సోకే తెగుళ్ళ నివారణకు రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సిందేనని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర కోఆర్డినేటర్ ఎ.విజయ భాస్కర్ సూచించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం ముచ్చర్ల, నాగారం, పెంబర్తి, మడిపల్లి, పెగడపల్లి, ఎల్లపూర్ లలో వరి, మొక్కజొన్న, కూరగాయ, మిర్చి, పండ్ల పంటలను విజయభాస్కర్ సందర్శించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటకు జింక్ లోపం లక్షణాలు గమనించినట్లయితే, జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, లీటర్ నీటికి కలిపి, ప్రధాన పొలంలో నాటిన 20 రోజులకు మొదటి సారిగా, ఆ పైన వారం రోజులకు రెండవ సారిగా పిచికారి చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కాండం పురుగు ఉధృతి అధికంగా ఉంటుందని, కావున ప్రధాన పొలంలో పిలకలు వేసే దశ లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3 సి. జి. గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకోవాలని తెలిపారు. అలాగే అగ్గి తెగులు నివారణకు ఐసోప్రోథయోలేన్ 1.5 మి. లీను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం మొక్కజొన్న తొలిదశలో ఆశించే కత్తెరపురుగు నివారణకు వేపనూనె (1500ppm) 5 మి.లీను ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలని సూచించారు. తీవ్రత ఎక్కువగా గమనించినట్లయితే.. క్లోరాంట్రానిలిప్రోల్ గుళికలు ఎకరానికి 4 కిలోలు మొవ్వులో వేసుకోవాలి లేదా 60 మి.లీ.క్లోరాంట్రానిలిప్రోల్ మందును ఒక ఎకరానికి వినియోగించాలని వివరించారు. మామిడి పంటలో తామర పురుగుల నివారణకు ఫిప్రోనిల్ 2.0 మి. లీను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని, అలాగే మిర్చి పంటలో ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్షి క్లోరైడ్ 3 .0 గ్రామును ఒక లీటర్ నీటికి కలిపి మొదళ్ళ దగ్గర వాడాలని వివరించారు. ఈ పంట పొలాల సందర్శన కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
